Begin typing your search above and press return to search.

క్లారిటీ ఇవ్వ‌కుండా ఈ క‌న్ఫ్యూజ‌న్ ఏల ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   10 Aug 2018 5:22 AM GMT
క్లారిటీ ఇవ్వ‌కుండా ఈ క‌న్ఫ్యూజ‌న్ ఏల ప‌వ‌న్‌?
X
అయోమ‌యంతో ఉన్న ప్ర‌జ‌ల‌కు చ‌క్క‌టి దారి చూపించ‌టం.. ఆ దారి ఎందుకు మంచిద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం గ‌తంలో నేత‌లు చేసే ప‌ని. ఇప్పుడు అందుకు భిన్నంగా త‌మ మ‌న‌సులోని అస్ప‌ష్ట‌త‌ను జ‌నం మీద రుద్ద‌టం ఒక అల‌వాటుగా మారుతోంది. మ‌న‌సులో దాచుకునే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు బ‌య‌ట‌ప‌డిపోకుండా ఉండేందుకు ప‌డే పాట్ల‌లో భాగ‌మే లేనిపోని క‌న్ఫ్యూజ‌న్ ను జ‌నాల మీద‌కు రుద్ద‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు చూస్తే ఈ విష‌యం మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపించ‌క మాన‌దు. తాను కులాలు.. మ‌తాల‌కు అతీత‌మ‌ని.. అంద‌రూ సోద‌ర‌భావంతో ఉండాల‌ని ఆయ‌న చెబుతారు. మ‌రి.. అన్ని నీతులు చెప్పే పెద్ద మ‌నిషి.. కాపు రిజ‌ర్వేష‌న్ల మీద క్లారిటీ ఇవ్వ‌రెందుకు? అన్న ప్ర‌శ్న వేస్తే.. స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా లేనిపోని క‌న్ఫ్యూజ‌న్ నెత్తిన వేసేస్తుంటారు.

తాను ఒక్క కులాన్ని న‌మ్ముకుని రాజ‌కీయాల్లోకి రాలేద‌ని.. కులాన్ని ఓటుబ్యాంకుగా చూడ‌టం లేదంటూ పెద్ద మాట‌లు చెప్పే సారూ.. సామాజిక న్యాయం కోస‌మే వ‌చ్చిన‌ట్లు చెబుతారు. గ‌తంలోనూ ప‌వ‌న్ అన్న చిరు సైతం సామాజిక న్యాయ‌మే త‌న ఎజెండా అంటూ వ‌చ్చి.. నాలుగు రోజులు రాజ‌కీయం న‌డిపి త‌ర్వాతేం చేశారో తెలియంది కాదు. అలా అని ప‌వ‌న్ అదే బాట‌లో న‌డుస్తార‌న్న బాధ్య‌తారాహిత్య‌మైన మాట‌ల్ని మేం చెప్పం. కాకుంటే.. అన్న చెప్పిన మాట‌ల్నే త‌మ్ముడు వ‌ల్లె వేసే క‌న్నా.. ఆ సామాజిక న్యాయాన్ని ఎలా సాధించాల‌నుకుంటున్నార‌న్న స్ప‌ష్టంగా చెప్పు ప‌వ‌నా? అంటూ ప్ర‌శ్నిస్తున్న వారికి స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి.

త‌న పార్టీ సిద్ధాంతాల్లో కులాల ఐక్య‌త అని పెట్టాన‌ని.. కానీ ఇప్పుడున్న పార్టీలు మ‌నుషుల్ని మ‌నుషులుగా కాకుండా ముక్క‌లుగా.. కులాలుగా చూడ‌టం త‌న‌కు బాధ క‌లుగుతోంద‌ని చెప్పారు. ఇన్ని మాట‌లు చెప్ప‌కుండా..సూటిగా స్ప‌ష్టంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లుగా ఇష్యూను తేల్చ‌కుండా అదే ప‌నిగా జీడిపాకం లాగిన‌ట్లుగా లాగ‌డేంది? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి మాట్లాడితే బీసీలు దూర‌మైపోతార‌ని.. వ్య‌తిరేకంగా మాట్లాడితే కాపులు దూర‌మైపోతార‌ని లెక్క‌లు వేసుకొని స‌మాజాన్ని ముక్క‌లుగా చీల్చేశార‌న్న ఆక్రోశాన్ని వ్య‌క్తం చేసే ప‌వ‌న్‌.. తాను అందుకు భిన్న‌మైన నేత‌గా చెప్పుకుంటూ.. క్లారిటీ ఇచ్చేస్తే స‌రిపోతుంది క‌దా? కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే బీసీల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌నే వారే.. కాపుల వెనుక ఉండి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తుంటార‌ని త‌ప్పు ప‌ట్టారు.

స‌రే.. వారంటే రాజ‌కీయాల్ని భ్ర‌ష్టు ప‌ట్టించ‌టానికే ఇలా చేస్తున్నారు ఓకే. మ‌రి.. మీ సంగ‌తేంది? వాళ్లు ఇలా చేస్తున్నారు? వీళ్లు ఇలా చేస్తున్నార‌న్న మాట‌లు కాదు.. మీరేం చేయాల‌నుకుంటున్నారు? ఏం చేస్తారు? అన్న‌ది చెప్ప‌కుండా.. అదే ప‌నిగా ఎవ‌రో ఒక‌రి మీద విమ‌ర్శ‌లు చేయ‌టం ఏమిటి ప‌వ‌నా? అన్న సందేహం ప‌లువురి నోటి నుంచి వ‌స్తోంది.

ఇప్ప‌టికైనా స‌రే.. కీల‌క అంశాల మీద ఉన్న‌ది ఉన్న‌ట్లుగా.. మ‌న‌సులో ఏం అనుకుంటున్న‌ది చెప్పేస్తే క్లారిటీ వ‌స్తుంది. అలా కాకుండా క‌న్ ఫ్యూజ్ చేస్తే.. ఇష్యూ మ‌రింత ముదురుతుందే త‌ప్పించి ఒక కొలిక్కి రాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి.. ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.