Begin typing your search above and press return to search.

పత్రికాధిపతిపై పవన్ విసుర్లు సరైనవేనా?

By:  Tupaki Desk   |   24 Aug 2015 6:30 AM GMT
పత్రికాధిపతిపై పవన్ విసుర్లు సరైనవేనా?
X
పవన్ ఎప్పుడు బయటకు వచ్చినా.. తానొచ్చిన అంశాలతో పాటు.. మరికొన్ని అంశాల్ని సైతం టచ్ చేసి వెళ్లిపోతుంటారు. తన గురించి చేసే వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తుంటారు. ఈ సందర్భంగా ఆయన ఎవరిని పెద్దగా ఉపేక్షించరు. నిజానికి చాలాతక్కువ మంది మాత్రమే తెలిసే అవకాశం ఉన్న విషయంపై కూడా పవన్ రియాక్ట్ అయిన తీరు చూసినప్పుడు.. మీడియాలో తన మీద వచ్చే అంశాల మీద చాలా అలెర్ట్ గా ఉన్నట్లు కనిపించక మానదు.

ఏపీ రాజధాని భూముల విషయంలో పెనుమాక పర్యటన చేసిన సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. తన ప్రసంగంలో ఒక పత్రికాధిపతి ప్రస్తావన తీసుకొచ్చారు. ఒక ప్రముఖ పత్రికలో తనకు సంబంధించిన ప్రస్తావన పై ఆయన వివరణ ఇవ్వటంతో పాటు.. తన గురించి ఎలా పడితే అలా రాయొద్దన్న సంకేతాన్ని ఇచ్చారు.

సదరు ప్రముఖ పత్రికాధిపతి ప్రతి వారాంతంలోనూ రాజకీయ విశేషాల మీద వ్యాసం రాస్తుంటారని.. అలాంటి ఒక వ్యాసంలో తాను గతంలో రాజధాని ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా తన వెంట ఉన్న వారంతా ఒక సామాజిక వర్గం వారేనని వ్యాఖ్యానించారని.. అలాంటి మాటలు ఎలా రాస్తారని నిలదీశారు. తనకు కులం.. మతం లాంటి వాటికి తాను అతీతమని.. అలాంటి తనకు కులాన్ని అపాదించటం సరికాదంటూ.. ‘‘నాకు కులమేంటి అసహ్యంగా’’అంటూ తన సినిమాల్లో చెప్పేలా చెప్పటం గమనార్హం.

మరి.. ఈ విషయంలో తప్పొప్పుల విషయానికి వస్తే.. ఒక వ్యక్తికి సంబంధించి రాసే రాజకీయ వ్యాసం చాలా జాగరూకతో ఉండాలి. అదే సమయంలో పరిశీలనను అత్యంత జాగ్రత్తగా.. జాగరూకతో చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇక్కడ మరో ఇబ్బంది కూడా ఉంది. ఒక పత్రికాధిపతి మాత్రమే కాదు.. ఒక జర్నలిస్టు దృష్టికోణం కాస్తంత విమర్శనాత్మకంగానే ఉంటుంది.

అందులోకి సహజంగా జర్నలిస్టు (?) అయిన సదరు పత్రికాధిపతి దృష్టి కోణం విమర్శనాత్మకంగా ఉండటాన్ని తప్పు పట్టలేం. పవన్ లాంటి వ్యక్తి రాజధాని ప్రాంతంలో.. అక్కడి రైతుల సమస్యల గురించి పర్యటన జరిపే సమయంలో.. చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించటం పాత్రికేయ ధర్మం. తనకు కనిపించిన విషయాన్ని కనిపించినట్లుగా చెప్పకుండా.. దానికి వ్యాఖ్యను జోడించటం అసలు సమస్య అన్న భావన ఉంది. ఇలాంటి సందర్భంలో.. ఒక రాజకీయ నేత మీద ఒక ముద్ర వేయాలని భావించినప్పుడు.. అతడి వ్యక్తిగత విషయాల గురించి కాస్తంత ఆరా తీసి ఉంటే.. పవన్ రియాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చేది కాదేమో. ఏది ఏమైనా సదరు పత్రికాధిపతి ప్రస్తావన ద్వారా పవన్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. తాను అన్ని గమనిస్తున్నానని.. తన పనిలో తాను బిజీగా ఉన్నా.. తనకు సంబంధించిన అంశాల పట్ల మరీ అంత పరాకుగా లేనని చెప్పేశారు. ఎవరి మీదైనా.. ఏదైనా ముద్రలేసే సమయలో ఆచితూచి వ్యవహరించాలన్న విషయం ఈ వ్యవహరం చెబుతుంది.