Begin typing your search above and press return to search.

ఏపీ సీఎంగా జగన్... పీకే ఛాన్సే లేదంటున్నారే!

By:  Tupaki Desk   |   9 April 2019 5:21 PM GMT
ఏపీ సీఎంగా జగన్... పీకే ఛాన్సే లేదంటున్నారే!
X
ఏపీలో రసవత్తరంగా సాగుతున్న ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైన ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసిపోయింది. ఎల్లుండి పోలింగ్ జగనుంది. ప్రచారంలో భాగంగా అటు అధికార టీడీపీతో పాటు ఇటు వైసీపీ - జనసేన - ఇతర పార్టీలు కూడా తమదైన శైలి ప్రచారాన్ని నిర్వహించాయి. ప్రచారానికి గడువు ముగిసిపోవడంతో ఇక రాష్ట్రంలో నిశ్శబ్ధం అలముకుంది. ఈ నేపథ్యంలో ఏపీకి కాబోయే సీఎం ఎవరంటూ ఎవరికి తోచిన లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ తరహా లెక్కలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి కూడా వచ్చాయి. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కాబోయే సీఎం ఎవరన్న విషయంపై కంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఏపీ సీఎం కాలేరన్న దానినే ఆధారం చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో వైసీపీకి విజయం దక్కే ఛాన్స్ లేదని - జగన్ సీఎం అయ్యే అవకాశాలే లేవని కూడా పవన్ కుండబద్దలు కొట్టారు. ఇందుకు గల కారణాలను కూడా ప్రస్తావించిన పవన్... తనదైన శైలి లెక్కలను చెప్పుకుపోయారు. ఇందులో మొదటి కారణంగా టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రిడిక్షన్స్ ను ప్రస్తావించారు. 2014లో ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని - జగన్ సీఎం కావడం ఖాయమని కేసీఆర్ చెప్పారని, అయితే అందుకు విరుద్ధంగా జరిగిందని పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా కేసీఆర్ 2014 మాదిరిగానే ఇప్పుడు కూడా జగనే ఏపీ సీఎం కాబోతున్నారని చెబుతున్నారని - అయితే గతంలో జరిగినట్లుగానే కేసీఆర్ అంచనాలు తప్పడం ఖాయమేనని తేల్చేశారు.

ఇక పవన్ చెప్పిన రెండో కారణం ఏమిటంటే... తిరుమలకు చెప్పులతో వెళ్లిన జగన్ సీఎం ఎలా అవుతారని లాజిక్ లాగారు. తిరుమలకు చెప్పులతో వెళ్లిన జగన్ సీఎం అయ్యే ఛాన్స్ లేదని పవన్ తనదైన లెక్క చెప్పారు. ఈ రెండు కారణాలనే ఆధారం చేసుకున్న పవన్... ఈ ఎన్నికల్లోనూ వైసీపీ కి విజయం దక్కదని - జగన్ సీఎం కాలేరని కూడా చెప్పుకొచ్చారు. అయితే మరి జగన్ సీఎం కాకుంటే... ఏపీకి కాబోయే సీఎం ఇంకెవరన్న విషయాన్ని ప్రస్తావించగా... కొద్దిసేపు నీళ్లు నమిలిన పవన్... ఈ ఎన్నికల్లో తన పార్టీ జనసేన విజయం సాధిస్తుందని, తానే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నానంటూ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.