Begin typing your search above and press return to search.

పవన్.... ఇది కూడా తెలియదా... !

By:  Tupaki Desk   |   3 Dec 2018 6:18 AM GMT
పవన్.... ఇది కూడా తెలియదా... !
X
పవన్ కల్యాణ్. ఈమధ్యనే రాజకీయ రంగంలో అడుగుపెట్టిన వెండితెర హీరో. సినీ అనుభవం తప్ప రాజకీయానుభవం బొత్తిగా లేని పవన్ కల్యాణ్ తన ప్రసంగాల్లో మసాలా గురించి పట్టించుకుంటున్నారు తప్ప వాస్తవాలు ఆయనకు తెలియడం లేదనే విమర‌్శలు వస్తున్నాయి.దీనికి తాజా ఉదాహరణగా అనంతపురం జిల్లాలో జరిగిన ఓ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. ఇందుకు పవన్ కల్యాణ్ వంతగా తీసుకున్న వైనం కూడా అందరినీ ఆశ్యర్చానికి గురి చేస్తోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లాగే జగన్ మోహన్ రెడ్ది కూడా జైలుకు వెళ్తారని పవన్ చెబుతున్నారు. దీన్నే రాజకీయ అనుభవం లేమి అంటారని రాజకీయ పండితులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా జైలుకు పంపించిందని - ఈ కేసులు ఏవీ న్యాయస్ధానంలో నిలిచేవి కావని లోకం కోడై కూస్తోంది. ఆ మ‌ధ్య ఉండ‌వ‌ల్లితో పాటు ప‌లువురు న్యాయ‌వాదులు కూడా ఇదే చెప్పారు. పైగా జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ అధికారంలో లేరని - ఆయనపై చంద్రబాబు నాయుడు - కాంగ్రెస్ పార్టీలు కలిసి పన్నిన కుట్రలో భాగంగా జైలుకు వెళ్లారని వారు అంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సిబిఐ మాజీ అధికారులు స్పష్టం చేస్తున్నారని అంటున్నారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లింది ప్రభుత్వంలో అవినీతి కారణంగానే అనే విషయం కూడా తెలియని పవన్ కల్యాణ్ ఎలాంటి అవినీతికి పాల్పడని జగన్ మోహన్ రెడ్డిని ఆయనతో పోల్చడమే రాజకీయ అనుభవ లేమికి నిదర్శనమంటున్నారు. జగన్ మోహన్ రెడ్డిపై కేసుల గురించి అన్ని రాజకీయ పార్టీలకు - సీనియర్ నేతలకు తెలుసునని అంటున్నారు. మరీ ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డిపై బనాయించిన కేసుల గురించి తెలుగు ప్రజలకు తెలుసునని - రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ కేసులు పెట్టారని వారంతా నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఈ విషయం తెలుసు కాబట్టే జగన్ ప్రజా సంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారని రాజకీయ పండితుల విశ్లేషణ. ఈ విషయం తెలియని పవన్ కల్యాణ్ నోటికి వచ్చింది మాట్లాడితే రాజకీయంగా ఆయనకే నష్టమని అంటున్నారు.