Begin typing your search above and press return to search.

ఏడాదికి వెయ్యికోట్లంటున్న పవన్...లాజిక్ మిస్ అవుతున్నారా?

By:  Tupaki Desk   |   13 July 2023 9:42 AM GMT
ఏడాదికి వెయ్యికోట్లంటున్న పవన్...లాజిక్ మిస్ అవుతున్నారా?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతున్న ఈ యాత్రకు సంబంధించి బుధవారం తాడేపల్లిగూడెంలో కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.

తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో మైకందుకున్న పవన్... సినిమాల్లో తన సంపాదన గురించి కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. గతంలో రోజుకి రెండు కోట్లు తన సంపాదన అని పలుసందర్భాల్లో చెప్పిన పవన్... తాజాగా ఏడాదికి వెయ్యి కోట్లు అని అన్నారని అంటున్నారు. అయినా కూడా ప్రజలకోసం, ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరచడం కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారని తెలుస్తుంది!

అవును... "దేశంలోని ప్రముఖ నటుల్లో నేను కూడా ఒకడిని. రాజకీయాల్లోకి వచ్చే అవసరం నాకు ఉందా? ప్రజలకు ఉపాధి భద్రత కోసమే రాజకీయాల్లోకి వచ్చా.." అని పవన్ తాడేపల్లి సభలో వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... ఉద్యోగులు, చిరు వ్యాపారాలు చేసుకొనే వారికి మేలు చేయాలనే లక్ష్యంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చినట్లుగా పవన్ చెబుతున్నారని తెలుస్తుంది.

అంబేద్కర్ ఆశయాలను న్యాయ పోరాట నిపుణుడు నాని ఫాల్కివాలా, ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీని ఎదుర్కొన్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ తనకు ప్రేరణ అని చెప్పిన పవన్... బడుగు వర్గాల అభ్యున్నతికి పాల్పడిన రాం మనోహర్ లోహియా తనకు స్పూర్తి అని అన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో "మన కోసం ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు నాకు ఆదర్శం" అని కూడా అన్నారు పవన్ కల్యాణ్!

ఇదే సమయంలో... గత ఎన్నికల్లో తాను ఓడిపోయినా మీ కోసం నిలబడి ఉన్నాను అని చెబుతూ గతం గుర్తుచేసుకున్న పవన్... "మీ సంక్షేమం కోసం ఎవరితో పోరాటం చేస్తున్నానో తెలుసా? నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు" అంటూ తూర్పుగోదావరి జిల్లాలో చేసిన సంచలన వ్యాఖ్యలు మరోసారి చేశారు. అయితే... ఇలా పవన్ ని చంపేస్తామని ఎవరు బెదిరిస్తున్నారు అని ఆందోళనలో జనసైనికులు ఉన్నారని అంటున్నారు.

మరోవైపు ఏడాదికి వెయ్యి కోట్ల సంపాదన అని పవన్ చేసిన వ్యాఖ్యలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని తెలుస్తుంది. కారణం... పవన్ స్వయంగా తాను రోజుకు రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటానని అనేక సందర్భాల్లో స్వయంగా వెల్లడించారని.. అలాంటప్పుడు ఏడాదికి ఉండే 365 రోజుల్లో 52 ఆదివారాలు ఖచ్చితంగా తీసేస్తే... మిగిలిన అన్ని రోజులూ పనిచేసినా కూడా 620 కోట్లే కదా అని కొందరు కామెంట్ చేస్తున్నారని తెలుస్తుంది!

ఏది ఏమైనా... ప్రతీ సభలోనూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తారు పవన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఏడాదికి వెయ్యి కోట్ల సంపాదన, చంపుతామనే బెదిరింపు వ్యాఖ్యలు తాడేపల్లిగూడెంలో సంచలనాలని అంటున్నారు.