Begin typing your search above and press return to search.

తిరుపతిలో అన్నయ్య ప్రస్తావన వెనుక పవన్ ఆలోచన ఇదేనా?

By:  Tupaki Desk   |   8 Dec 2020 8:30 AM GMT
తిరుపతిలో అన్నయ్య ప్రస్తావన వెనుక పవన్ ఆలోచన ఇదేనా?
X
కుటుంబ సభ్యుల ప్రస్తావన తక్కువగా తెస్తుంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సినిమాలకు సంబంధించి తన అన్న చిరును తరచూ ప్రస్తావించే ఆయన.. రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం.. అస్సలు టచ్ చేయకుండా ఉండిపోతారు. చాలా అరుదుగా మాత్రమే తన అన్న ప్రస్తావన తెస్తుంటారు. అలాంటి పవన్.. తిరుపతిలో మాత్రం తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు. తన అన్న చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఉంటే తప్పక ముఖ్యమంత్రి అయ్యే వారన్నారు. ఇంతకాలం లేనిది.. ఇప్పుడే పవన్ కు చిరంజీవి ఎందుకు గుర్తుకు వచ్చినట్లు? దాని వెనుక లెక్క ఏమిటన్నది చూస్తే.. ఆయన దూరదృష్టితోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పాలి. త్వరలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నాయి. ఈ స్థానం నుంచి జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. అది కూడా బీజేపీ మద్దతు తీసుకొని.

ఈ కారణంగానే చిరంజీవి ప్రస్తావన తీసుకురావటం ద్వారా.. నియోజకవర్గంలో అధికంగా ఉండే కాపుల్ని ఒక తాటి మీదకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే చిరంజీవి ప్రస్తావన తీసుకురావటం ద్వారా.. మెగాఅభిమానుల్ని ఒక తాటి మీదకు తీసుకురావటం.. ఓటర్లను సమీకరించే ప్రయత్నం చేసినట్లుగా చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీ ప్రారంభ సభను తిరుపతిలో నిర్వహించిన చిరంజీవి.. అక్కడ నుంచి పోటీ చేసి గెలవటం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో చిరంజీవి తిరుపతితో పాటు పాలకొల్లు నుంచి పోటీ చేయగా.. అనూహ్యంగా ఆయన తన సొంత ప్రాంతంలో ఓటమి పాలయ్యారు. తిరుపతిలో మాత్రం విజయం సాధించారు.

ఇక.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేయగా.. ఆయనకు 20 వేల ఓట్లు వచ్చాయి. లోక్ సభ స్థానానికి మాత్రం పోటీ చేయకుండా.. పొత్తులో భాగంగా బీఎస్పీకి అప్పజెప్పారు. ఆ ఎన్నికలో బీఎస్పీ అభ్యర్థికి 24 వేల ఓట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే తిరుపతిలో జనసేన బలం పరిమితమని చెప్పక తప్పదు. తనబలంతో పాటు.. తన అన్న చిరుకు ఉన్న బలాన్ని తన ఖాతాలోకి బదిలీ చేసుకోవటంలో సక్సెస్ అయితే.. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రభావిన్ని చూపిస్తానని ఆశిస్తున్నారు. అదే సమయంలో ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తి ప్రదర్శిస్తున్న బీజేపీని నిలువరించి.. తాము పోటీ చేస్తే.. ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలో పవన్ ఉన్నారు. అయితే.. అప్పట్లో చిరు గెలుపే.. ఒక అనుకోకుండా జరిగినట్లు చెబుతారు. తనకు కులాలు.. మతాలు లాంటి వాటితో రాజకీయాలు చేయనని చెప్పే పవన్.. తిరుపతిలో తన అన్న ప్రస్తావనవెనుక.. నియోజకవర్గ పరిధిలో ప్రభావాన్ని చూపే కాపుల ఓట్ల కోసమేనన్నది మర్చిపోకూడదు. అవసరానికి తగ్గట్లు సిద్ధాంతాల్ని మార్చుకోవటం రాజకీయాల్లో మామూలే. అందుకు పవన్ మినహాయింపేమీ కాదు.