Begin typing your search above and press return to search.

చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఉంటే.. పవన్ నోట ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 Dec 2020 3:39 AM GMT
చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఉంటే.. పవన్ నోట ఆసక్తికర వ్యాఖ్యలు
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ ఆయన నోటి నుంచి ఒక మాట తాజాగా వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. తన అన్న చిరంజీవి గురించి.. ఆయన పెట్టిన ప్రజారాజ్యం గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. అప్పుడప్పుడు ప్రజారాజ్యం పార్టీని రిఫరెన్సుగా ప్రస్తావిస్తారే తప్పించి.. వ్యాఖ్యలు చేసేది తక్కువ. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తిరుపతిలో ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి.

తన సోదరుడు చిరంజీవి రాజకీయాల్లో ఉండి ఉంటే.. ఏపీలో పరిస్థితులు మరోలా ఉండేవని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ‘చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. అధికారం మనకు బాధ్యత, అలంకారం కాదు. అజమాయిషీ చేయటానికి అధికారం అని ఇప్పుడు అనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

సిమెంటు ఫ్యాక్టరీ కోసమో.. ఇసుక అమ్ముకోవటానికో.. మద్యం అమ్ముకోవటానికో తాను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోవట్లేదని చెప్పారు. ఆశయ బలం ఉన్న వారికి ఓటమి కుంగుబాటునుఇవ్వదన్నారు.తమను గెలిపించిన రైతుల కోసం ఏపీ అధికారపక్షం ఏమీ చేయలేకపోవటాన్ని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం ఉండి కూడా ఏం ప్రయోజనం? అని ప్రశ్నించారు. ఏపీలో నెలకొన్న పరిస్థితుల గురించి చెబుతూ.. ఎస్సీలపై ఎస్సీలతోనే కేసులు పెట్టిస్తున్నారన్నారు.

ఎన్నికల్లో ఓడినప్పటికీ.. ఓటమి ఎదురైనప్పటికి నిలబడగలమని తాను నిరూపిస్తున్నట్లు చెప్పిన పవన్ కల్యాణ్.. ప్రశ్నించటం ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రక్రియగా అభివర్ణించారు. తిరుపతిలో నిర్వహించిన సభకు జనసేన కార్యకర్తలు.. అభిమానులు భారీగా పాల్గొన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో.. తాజా నిర్వహించిన సభ సన్నాహక సభగా అభివర్ణించక తప్పదు. ఇన్నాళ్లకు అన్న చిరును పవన్ గుర్తు చేసుకోవటం గమనార్హం.