Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కు అనుభ‌వం వ‌చ్చేసిందంట‌!

By:  Tupaki Desk   |   28 July 2018 5:30 PM GMT
ప‌వ‌న్ కు అనుభ‌వం వ‌చ్చేసిందంట‌!
X
ఏమైనా స‌రే.. ఏం చెప్పినా స‌రే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెబితే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. సినిమాల్లో ఎలా అయితే.. అరే.. సాంబా రాసుకోరా అన్న చందంగా రాజ‌కీయ రంగంలోనూ ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు కాస్త సిత్రంగా ఉంటున్నాయి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల మొద‌లు.. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన ఆవిర్భావ స‌భ నిర్వ‌హించేంత వ‌ర‌కూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లోని లోపాల్ని ఎత్తి చూపేందుకు ప‌వ‌న్ సార్ కు నోరు వ‌చ్చిందే లేదు. అయ్యో.. పెద్ద సారువారిని అనటం ఏమిటి? ఆయ‌న‌కున్న అనుభ‌వం ఎంత‌టిది? అలాంటి పెద్ద మ‌నిషిని ఏమైనా అంటే క‌ళ్లు పోతాయి సుమి అన్న చందంగా ప‌వ‌న్ మాట‌లు ఉండేవి.

ఏపీని అనుభ‌వం ఉన్న రాజ‌కీయ నేత చేతుల్లో పెట్టేందుకే తాను మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లుగా చెప్పుకున్న ఆయ‌న‌.. తాను అనుభ‌వం కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా త‌న మాట‌ల‌తో చెప్పేవారు. మ‌రి.. రాజ‌కీయ అనుభ‌వం రావ‌టానికి ఏం చేస్తున్నారు ప‌వ‌న్ గారూ అనే అడిగే అవ‌కాశాన్ని ఆయ‌న ఎప్పుడూ ఇచ్చే వారు కాదు.

త‌న‌కు తోచిన‌ప్పుడు ట్వీట్లు.. త‌న‌కు న‌చ్చిన‌ప్పుడు ప‌ర్య‌ట‌న‌లు.. మ‌రీ మ‌న‌సు లాగేస్తే.. ఏదో ఒక జిల్లాలో స‌భ పెట్టి హ‌డావుడి చేసే ప‌వ‌న్.. అప్పుడు కూడా బాబు ప్ర‌భుత్వంలోని లోపాల్ని ఎత్తి చూపించేందుకు మ‌న‌సు వ‌చ్చేది కాదు. అరే.. ఎందుకంత తొంద‌ర‌.. అంత పెద్ద మ‌నిషిని అనాలంటే ఎన్ని చూసుకోవాలి? అంత త్వ‌ర‌గా ఎందుకు త‌ప్పు ప‌డుతారన్న‌ట్లుగా ఆయ‌న మాట్లాడేవారు.

అలాంటి ప‌వ‌న్ కు ఉన్న‌ట్లుండి.. ఏ రాత్రి వేళ ఏ క‌ల వ‌చ్చిందో కానీ ఆయ‌న మాట మారిపోయింది. మొన్న‌టి వ‌ర‌కూ బాబు మీద ఈగ కాదు క‌దా.. ఈగ రెక్క వాలినా ర‌క్ష‌కుడిగా తానున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. పెద్ద బాబును.. చిన‌బాబును ఒకేసారి ఉతుకుడు కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టారు. ముఖ్య‌మంత్రి కొడుకు ముఖ్య‌మంత్రే కావాలా? అంటూ ఆయ‌న సీరియ‌స్ గా ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసుకుంటున్నారా? మీ దృష్టికి వ‌చ్చిందా? అంటూ సిత్ర‌మైన ప్ర‌శ్న‌ల్ని సంధించ‌టం షురూ చేశారు.

అప్ప‌టి సంధి.. బాబు ప్ర‌భుత్వం మీద విమ‌ర్శలు.. ఆరోప‌ణ‌లు సంధించ‌టం మొద‌లెట్టేశారు. అయ్యో.. నా ఏపీకి ఎంత క‌ష్టం.. ఎంత న‌ష్టం.. ఇంత దుర్మార్గంగా పాలిస్తారా? అంటూ గుండెలు బాదేసుకోవ‌టం మొద‌లెట్టారు. నాలుగేళ్ల పాటు తాను చెప్పిన అనుభ‌వం మాట‌ల్ని ప‌క్క‌న పెట్టేసి.. బాబును టార్గెట్ చేయ‌టం షురూ చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆయ‌న చేస్తున్న పోరాట యాత్ర సంద‌ర్భంగా అద్భుత‌మైన మాట ఒక‌టి ప‌వ‌న్ నోటి వెంట వ‌చ్చేసింది.

2009 నుంచి తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉండి.. త‌గిన అనుభ‌వాన్ని సాధించాన‌ని.. 2019 ఎన్నిక‌ల్లో తాము అన్ని ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో స‌మ‌స్య‌ల‌పై బ‌హిరంగంగా చ‌ర్చించ‌టానికి తాను సిద్ధ‌మ‌ని భీమ‌వ‌రంలో చ‌ర్చ‌కు సిద్ధ‌మా? అంటూ స‌వాల్ విసిరారు. స‌వాలు సంగ‌తి ప‌క్క‌న పెడితే.. రాజ‌కీయంలో అనుభ‌వాన్ని ప‌వ‌న్ ఎప్పుడు సంపాదించారు? అంత అనుభ‌వ‌మే ఉండి ఉంటే.. ఆర్నెల్ల క్రితం వ‌ర‌కూ బాబు అనుభ‌వం మీద స్తోత్రం చేసిందెందుకు సాంబ‌..?