Begin typing your search above and press return to search.

డేంజరస్ గేమ్ ఆడుతున్న పవన్ కల్యాణ్

By:  Tupaki Desk   |   19 Jun 2023 2:00 PM GMT
డేంజరస్ గేమ్ ఆడుతున్న పవన్ కల్యాణ్
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయ క్రీడకు తెర తీశారా? ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో అండర్ కవర్ గా ఉండే ఇష్యూను.. తెర మీదకు తీసుకొచ్చి బట్టలు ఊడబీకినట్లుగా ఆయన తీరు ఉందా? ఈ తరహా రాజకీయాలు ఇప్పటివరకు పరిచయం లేని ఏపీ ప్రజలు.. రానున్న రోజుల్లో ఏం కానుంది? కులాల పేరుతో చేసే రాజకీయాలను తర్వాతి లెవల్ కు తీసుకెళ్లిన పవన్.. ఒక డేంజరస్ గేమ్ ఆడుతున్నట్లు చెప్పాలి.

కాకినాడలో నిర్వహించిన వారాహి విజయాత్రలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ తన విశ్వరూపాన్నే ప్రదర్శించారని చెప్పాలి. సున్నితమైన కులాల అంశాన్ని తన ప్రసంగాల్లో తరచూ ప్రస్తావించే పవన్ కల్యాణ్.. కాకినాడ సభలో అందుకు భిన్నమైన తీరును ప్రదర్శించారు. ఇప్పటివరకు మరే రాజకీయ అధినేత కూడా చేయని రీతిలో ఆయన ప్రసంగాలు ఉన్నాయి. కులాల్ని అస్త్రాలుగా చేసుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం చూశాం. అవన్నీ కూడా తెర వెనుక చేసేవే తప్పించి.. తెర మీద మాట్లాడేది తక్కువని చెప్పాలి.

అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్.. ఇప్పుడు సామాజిక సమీకరణాల గురించి ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. కులాల మధ్య ఉండే సున్నితమైన సరళరేఖను పవన్ తన మాటలతో కొత్త సమీకరణాలకు తెర తీస్తున్నారని చెప్పాలి. ఈ తరహా పొలిటికల్ గేమ్ ను ఇప్పటివరకు మరే పార్టీ అధినేతలు ఇంతవరకు ఆడింది లేదు. ఇప్పుడు చెబుతున్న అంశం మరింత బాగా అర్థం కావాలంటే కాకినాడలో ఏర్పాటు చేసిన సభలో.. పవన్ చేసిన ఈ వ్యాఖ్యల్ని యధాతదంగా వింటే ఇట్టే అర్థమవుతుంది.

ఇంతకూ పవన్ ఏమన్నారంటే.. ''ఏపీలో కులాలను అడ్డం పెట్టుకుని నాయకులు ఎదుగుతున్నారు. అభివృద్ధి చెందుతున్నారు. ప్రజలు ఎదగడం లేదు. జనసేన కులమతాలకు అతీతంగా అన్నివర్గా ల వారికి సమన్యాయం అందిస్తుంది. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌లో లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దళిత సామాజిక వర్గానికి చెందిన తన కారు డ్రైవర్‌ని చంపేసి డోర్‌ డెలివరీ చేశారు. అప్పుడు దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేశారు? బాపట్లలో అక్కను ఏడిపిస్తున్నాడని ప్ర శ్నించినందుకు గౌడ సామాజికవర్గానికి చెందిన ఆ యువతి సోదరుడిని చెరువుతోటలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి హత్య చేశారు. ఇప్పుడెందుకు బీసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడడం లేదు. అన్నివర్గాల ప్రజలు ఆలోచించి జనసేన పార్టీకి అవకాశం కల్పిస్తే సామాజిక న్యాయం చేస్తాం'' అంటూ వ్యాఖ్యానించారు.

తన మాటలు ఒక వర్గానికి చెందిన వారి మీదనే కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. పవన్ మరో అంశాన్ని ప్రస్తావించారు. 2018లో జనసేన వీర మహిళలపై ఎమ్మెల్యే బలుపుతో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో దాడి చేయించారంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. 'పంతం నానాజీపై కూడా దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారన్న విషయమై తీవ్రంగా బాధ పడ్డా' అంటూ పేరర్కొన్నారు.

పవన్ మాటల్లో అభ్యంతరమంతా నేరాలు చేసే నేరస్తుల గురించి మాట్లాడాలే తప్పించి.. వారి సామాజిక వర్గాల గురించి మాట్లాడటమే. ఒక సామాజిక వర్గానికి చెందిన నేరస్తుడు దారుణమైన నేరానికి పాల్పడ్డాడని అనుకుందాం. అంత మాత్రాన ఆ సామాజిక వర్గానికి చెందిన వారందరంతా క్రిమినల్స్ కాదు కదా? పవన్ లాంటి నాయకుడి నోటి నుంచి వచ్చే మాటలు క్రమశిక్షణతో ఉండాలి. అందుకు భిన్నంగా బాధితుడి సామాజికవర్గాన్ని ప్రస్తావిస్తూ.. బాధ్యుడి సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తున్న తీరుతో సామాజిక ద్వేషం మరింత పెరిగే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కులాల గురించి పార్టీ అధినేతలు మాట్లాడటం కొత్త కాదు.కానీ.. ఈ తరహా మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఏ పార్టీ అధినేత మాట్లాడింది లేదు. ఇదే తరహాలో పవన్ ప్రసంగాలు ఉంటే మాత్రం.. కులాల మధ్య పంచాయితీలు కొత్త షేప్ లోకి వెళతాయని అంటున్నారు. జరిగిన దారుణాల్ని.. బాధితుల కష్టాల్ని హైలెట్ చేయటం తప్పు కాదు. కానీ.. అ క్రమంలో సంబంధితుల కులాల్ని ప్రస్తావించటంతోనే పంచాయితీ అంతా. ఇప్పటికే ఏపీలో కులాల రొచ్చు ఎక్కువన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. కాకినాడ సభతో పవన్ కల్యాణ్ ఈ కులాల అంశాల్ని కొత్త తరహాలో ప్రజెంట్ చేశారు. ఇది ఇక్కడితో ఆగేది కాదు. ఎక్కడి వరకు వెళుతుందన్నది మాత్రం కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.