Begin typing your search above and press return to search.

ఏపీ ఫ‌ర్ సేల్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు

By:  Tupaki Desk   |   29 Sep 2021 10:30 AM GMT
ఏపీ ఫ‌ర్ సేల్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు
X
గ‌డిచిన నాలుగు రోజులుగా జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. దూకుడు పెంచారు. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఆయ‌న ఏపీ స‌ర్కారుపై మౌనంగా ఉన్నారు. ఒక్క తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక స‌మ‌యంలో మాత్ర‌మే.. ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. అది కూడా కేవ‌లం గుడులు.. దాడులు అంశానికే ప‌రిమిత‌మ‌య్యారు. అలాంటిది ఇప్పుడు.. ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎంత‌కైనా రెడీ అన్న విధంగా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. కేవ‌లం సినిమా టికెట్ల విష‌యంతో మొద‌లు పెట్టారు.. అది ఇండ‌స్ట్రీకి సంబంధించిన అంశ‌మే క‌దా.. అందుకే ప‌వ‌న్ గ‌ళం విప్పారు.. అని అంద‌రూ అనుకున్నారు.

కానీ, త‌ర్వాత ఆయ‌న ఉద‌యం సాయంత్రం కూడా ఏపీ స‌ర్కారును టార్గెట్ చేస్తున్నారు. ఒక‌వైపు మంత్రుల‌ను మ‌రోవైపు ప్ర‌భుత్వ విధానాలను కూడా ప‌వ‌న్ ఎండ‌గడుతున్నారు. ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల‌తో న‌వ క‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని . ఆయ‌న చేసిన ట్వీట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. ‘‘తమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ సోమవారం పవన్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాదు.. ప్రభుత్వ ‘పాలసీ ఉగ్రవాదం’తో అన్ని రంగాలు, వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

ఇలా.. గ‌తానికి భిన్నంగా ఇటు మాట‌లు.. అటు ట్వీట్లు.. కూడా ప‌వ‌న్ జోరు పెంచారు. ఏపీ ఫ‌ర్ సేల్ ట్యాగ్‌లో ప‌వ‌న్ చేసిన ట్వీట్ మ‌రింత వేడి పెంచింది. ‘ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు. సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవరత్నాలు’ భావితరాలకు ‘నవకష్టాలు’ అని పవన్‌ విమర్శించారు. అప్పులు తేవడ‌మే ప్ర‌భుత్వ పాల‌న అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. ఆయ‌న ప‌రోక్షంగా ముఖ్య‌మంత్రిని టార్గెట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కు స‌రిప‌డా అప్పును మొత్తం తీసేసుకున్నార‌ని.. ఈ ఏడాదిలో చేయాల్సిన అప్పును కూడా చేసేశార‌ని.. దీంతో ప్ర‌జ‌ల‌పై ల‌క్ష‌ల కొద్దీ అప్పుల భారం పెరిగిపోతోంద‌ని.. ఇదే కొన‌సాగితే.. ఏపీని అమ్మేసినా.. ఈ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు తీర్చ‌డం క‌ష్ట‌మ‌ని.. వ్యాఖ్యానించారు. మొత్తానికి తాజా వ్యాఖ్య‌లు ఇటు అధికార ప‌క్షంలోనూ.. అటురాజ‌కీయ వ‌ర్గాల్లోనూ కాక రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.