Begin typing your search above and press return to search.

కేశినేని నాని విషయంలో పవన్‌ది అక్కస్సేనా?

By:  Tupaki Desk   |   7 July 2015 5:11 AM GMT
కేశినేని నాని విషయంలో పవన్‌ది అక్కస్సేనా?
X
తాను కోరుకున్నది దక్కనప్పుడు కాస్తంత చిరాకు.. మరికాస్త అసంతృప్తి ఉంటుంది. ఇలాంటి భావోద్వేగాలు.. తాను అన్నింటికి అతీతుడ్ని అని చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌లోనూ ఉన్నాయా? అంటూ అవుననే మాట వినిపిస్తోంది.

తాజాగా పవన్‌కల్యాణ్‌ నిర్వహించిన మీడియా సమావేశాన్ని చూసినప్పుడు.. ఏపీ ఎంపీలు చేతులు ముడుచుకొని కూర్చున్నారని.. చేతకాని వారి వలే వ్యవహరించటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని చెప్పటమే కాదు.. హక్కుల కోసం తెలంగాణ ఎంపీలు పోరాడేతత్వాన్ని ఏపీ ఎంపీలు అలవర్చుకోవాలన్న సూచన చేయటం తెలిసిందే.

ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ ఎంపీ స్థానానికి టీడీపీ టిక్కెట్టు కోసం కేశినేని నాని చేసిన హడావుడిని ప్రస్తావించిన పవన్‌ మాటల్ని చూసినప్పుడు కాస్తంత తేడా కొట్టటం ఖాయం. ఎంపీ టిక్కెట్టు కోసం కేశినేని నాని ఎంతో పోరాడారని.. గెలిచి ఏం చేస్తున్నారని ప్రశ్నించిన పవన్‌.. ఆయన వ్యాపార వేత్త అని.. ఆయనతో పాటు ఏపీ ఎంపీలంతా వ్యాపారవేత్తలు కావటంతో ఏమీ మాట్లాడటం లేదని విమర్శ చేశారు.

పవన్‌ మాటల్లో నిజం ఉందని ఎవరైనా చెబుతారు. కానీ.. విజయవాడ ఎంపీ స్థానం కోసం పవన్‌ ప్రతిపాదించిన పీవీపీ కూడా పారిశ్రామికవేత్తే కదా? ఆయనేమీ రాజకీయ నాయకుడు కాదు కదా? విజయవాడ టిక్కెట్టు కోసం తాను ప్రయత్నించి.. తర్వాత వదిలేసినట్లు పవన్‌ తనకు తానే ఒప్పేసుకున్న క్రమంలో.. కేశినేని నానిపై పవన్‌ చేసిన వ్యాఖ్యల్లో అక్కసు స్పష్టంగా కనిపిస్తోందన్న మాట వ్యక్తమవుతోంది. కేశినేని నానిపై ఎంత తీవ్రంగా స్పందించారో.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా పారిశ్రామికవేత్తేనని.. ఏపీ ప్రయోజనాల గురించి ఆయన కూడా చేస్తున్నది ఏమీ లేనప్పుడు.. ఆయన గురించి ఎందుకు వ్యాఖ్యలు చేయలేదన్న మాట వినిపిస్తోంది. ఏపీ ఎంపీల గెలుపు కోసం తాను ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేసిన పవన్‌.. మరి.. అలా ప్రచారం చేసిన వారిలో కొందరి పేర్లను మాత్రమే ప్రస్తావించటం ఏమిటన్న ప్రశ్నకు పవన్‌ ఏం సమాధానం చెబుతారో..?