Begin typing your search above and press return to search.

ఢిల్లీ నుంచి వ‌చ్చిన కాల్‌..ప‌వ‌న్ మూడ్ మార్చేసింది

By:  Tupaki Desk   |   13 July 2018 11:00 PM IST
ఢిల్లీ నుంచి వ‌చ్చిన కాల్‌..ప‌వ‌న్ మూడ్ మార్చేసింది
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో నాలుగేళ్ల పాటు దోస్తీ చేసి ఇటీవ‌ల దూరం అయిన జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికార పార్టీపై ప‌లు ఆరోప‌ణ‌లు - విమ‌ర్శ‌లు చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్లు గ‌మ‌నించని లోపాలు ఇప్పుడే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు క‌నిపిస్తున్నాయా అని కొంద‌రు ప్ర‌శ్నిస్తుండ‌గా...త‌మ‌ను ప్ర‌శ్నించ‌డం ఏమిట‌ని అంటున్న‌ట్లుగా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇలాంటి ఆస‌క్తిక‌రమైన ప‌రిణామాల‌ నేప‌థ్యంలో తాజాగా సంచ‌ల‌న కామెంట్లకు పెట్టింది పేర‌యిన టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు జేసీ ప‌వ‌న్ రెడ్డి మ‌రోమారు క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబోయే ఎన్నిక‌ల్లో అనంత‌పురం నుంచి పోటీ చేయ‌బోతున్నార‌నే వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన ప‌వ‌న్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కు కనీసం పది ఓట్లు - సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. పోటీ చేసేందుకు ఆ పార్టీకి కనీసం అభ్యర్థులు కూడా లేరని వ్యాఖ్యానిస్తూ...అధికార టీడీపీ - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి - వాటిని దక్కించుకోలేని వారు వచ్చే ఎన్నికల సమయంలో జనసేనలోకి వెళ్తారని ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ రెండు పడవలపై కాలు పెడుతున్నారని అందుకే ఆయ‌న్ను ఎవ‌రూ ఆద‌రించ‌ర‌ని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌ తో తనకు కొంచెం పరిచయం ఉందని పేర్కొంటూ అనంతపురం జిల్లాకు చెందిన వారే పవన్ చుట్టూ ఉండి ఆయ‌న రాజ‌కీయ ప‌య‌నం విష‌యంలో ప్ర‌భావితం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

గుంటూరు బహిరంగ సభ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుకు అనంత‌రం ఆయ‌న స్పందించిన తీరుకు స్ప‌ష్ట‌మైన తేడా ఉంద‌ని ప‌వ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ స‌మ‌యంలో ఏం మాట్లాడారో అందరికీ తెలుసునని అయితే, హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. ముందు రోజు వరకు తెలుగుదేశం పార్టీతో బాగా ఉండి, రాత్రికి రాత్రే పవన్ యూటర్న్ తీసుకున్నారని ఇందుకు కార‌ణం ఓ ఫోన్ కాల్ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తనకు ఉన్న సమాచారం మేరకు పవన్‌కు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని, మీరు టీడీపీతో ఉండవద్దని - మీకు ఎంత కావాలంటే అంత ముడుతుందని ఆ ఫోన్ కాల్ సారాంశమని, అందుకే ఆయన యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోందని సంచలన ఆరోపణ చేశారు. కాగా, ఎంపీ త‌న‌యుడి ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నంగా మారాయి.