Begin typing your search above and press return to search.

2014లో తప్పుచేశా : పవన్

By:  Tupaki Desk   |   8 Jun 2018 8:35 AM GMT
2014లో తప్పుచేశా : పవన్
X
పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో తన జోరు పెంచాడు. పాడేరు, మాడుగుల, వడ్డాది, రావికమతం, నర్సీపట్నంలలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘సినిమాలతో సమస్యలు తీరవని.. బయటకు వచ్చి చొక్కా పట్టుకొని అడిగితే సమస్యలు తీరుతాయనే వచ్చానని’ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ‘తాను ప్రత్యేక హోదా అడిగితే బెదిరించారని.. ఏదైనా చేసుకోండి.. మడమ తిప్పనని చెప్పానని.. దేనికి భయపడే వ్యక్తి కానని ’ సవాల్ విసిరాడు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు గురైందని.. సహజ వనరులు , నదులున్నా వలసలు తప్పడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి సరిచేయలేకపోతే ప్రత్యేక వేర్పాటు ఉద్యమాలొస్తాయని హెచ్చరించాడు. తాను ఎవరినీ రెచ్చగొట్టడం లేదని న్యాయం కోసం నిలదీస్తున్నానని చెప్పారు.

లక్షన్నర కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలకు విశాఖలో ఒప్పందాలు కుదుర్చుకున్నారని.. ఆ పరిశ్రమలు ఏవని పవన్ కళ్యాణ్ చంద్రబాబును నిలదీశారు. భూ కబ్జాలు లేవని సీఎం చంద్రబాబు - మంత్రి లోకేష్ చెబుతున్నారని.. విశాఖలో అడ్డగోలుగా భూముల కబ్జా జరిగిన విషయాన్ని స్వయంగా మంత్రి అయన్నపాత్రుడే చెప్పారని వ్యాఖ్యానించారు. మరి మీరేం చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ఇంతకు మించి రుజువులు ఏం కావాలని మండిపడ్డారు.

2014లో అవినీతి పార్టీలను అడ్డుకోవడానికి కలిసి ప్రయాణం చేద్దామంటే చంద్రబాబు సరేనన్నారని.. కానీ ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని పవన్ మండిపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయానన్నారు. హైదరాబాద్ లో చేసిన తప్పే మళ్లీ అమరావతిలో చేస్తున్నారని.. అభివృద్ధిని అమరావతిలో కేంద్రీకరిస్తున్నారన్నారు. 2014లో తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పు చేశానని అభిప్రాయపడ్డారు. అప్పుడు పోటీ చేస్తే కనీసం 5 నుంచి 10 సీట్లు అయినా ఉండేవని.. అప్పుడు టీడీపీ వైఫల్యాలను అవినీతిని నిలదీసేవాడినని చెప్పారు.

‘రాజధాని అమరావతి ఓ ఏనుగు అని.. ఏనుగును ఎవరైనా పెంచుకుంటారా.? దాన్ని మేపడం ఎంతో కష్టమని’ పవన్ అన్నారు.. ముఖ్యమంత్రి తీరు అప్పు ఇస్తే ఏనుగును అయినా కొనేలా ఉందని ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. తాను కులాలను రెచ్చగొడుతున్నానని బాబు అంటున్నాడని.. ఆ మాట అనడానికి సిగ్గుండాలన్నారు. టీడీపీలో ప్రతి నాయకుడి బండారం, దోపిడీ గురించి తెలుసనని.. తనతో డొంక తిరుగుడు వ్యవహారాలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. చంద్రబాబులా ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు తాను చదవడం లేదని.. మనసు లోతుల్లోంచి వచ్చిన భావాలే మాటలు అన్నారు. మీరు గద్దె ఎక్కి నన్ను తొక్కుతున్నారని.. ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకొని మాట్లాడవద్దని.. వయసు తగ్గ మాటలు కావన్నారు.