Begin typing your search above and press return to search.

జ‌న‌సేన అవిర్భావ స‌భ‌!... పీకే మేనిఫెస్టో ఇదే!

By:  Tupaki Desk   |   14 March 2019 4:28 PM GMT
జ‌న‌సేన అవిర్భావ స‌భ‌!... పీకే మేనిఫెస్టో ఇదే!
X
టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో రిలీజైపోయింది. తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో కాసేప‌టి క్రితం జ‌రిగిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ఆ పార్టీ అధినేత హోదాలో ప‌వ‌న్ పార్టీ మేనిఫెస్టోనే విడుద‌ల చేశారు. రానున్న ఎన్నిక‌ల‌కు దృష్టిలో పెట్టుకుని విడుద‌ల చేసిన ఈ మేనిఫెస్టో... ఏ ఇత‌ర రాజకీయ పార్టీల‌కు తీసిపోని విధంగానే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఉచితం మాట‌ను ప‌లుమార్లు ప‌లికిన ప‌వ‌న్‌.. విద్యార్థుల‌కు సాంతం ఉచిత విద్య‌తో పాటు ర‌వాణా - భోజ‌న సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పిస్తాన‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ - తాజాగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడులు ప్ర‌క‌టించిన రైతుకు పెట్టుబ‌డి సాయాన్ని కూడా ప్ర‌క‌టించిన పీకే... ఎక‌రాకు ఏడాదికి రూ.8 వేలతో పాటు 60 ఏళ్లు నిండిన అన్ని వ‌ర్గాల రైతుల‌కు రూ.5 వేల పింఛ‌న్‌ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

మేనిఫెస్టోపై సుదీర్ఘ ప్ర‌సంగం చేసిన పీకే... వైరివ‌ర్గాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలోనూ ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. ఈ క్ర‌మంలో కొంత భావోద్వేగం - కొంత ఆగ్ర‌హం క‌ల‌గ‌పిన స్వ‌రంతో త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించిన ప‌వ‌న్‌.. చాలా ఆస‌క్తిక‌ర అంశాల‌ను కూడా ప్ర‌స్తావించారు. తానేమీ డ‌బ్బు సంపాద‌న కోసం రాజ‌కీయాల్లోకి రాలేద‌న్న ప‌వ‌న్‌.. అస‌లు చంద్ర‌బాబు - జ‌గ‌న్ ల మ‌ధ్య విభేదాలు ఎందుకున్నాయో తెలియ‌దంటూ త‌న‌దైన శైలి కామెంట్లు చేశారు. ధ‌నార్జ‌న‌ - కులాల గొడ‌వ‌ల‌ను కూడా ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. ఇటు జ‌గ‌న్‌తో పాటు అటు చంద్ర‌బాబుకూ చుర‌క‌లు అంటించేశార‌నే చెప్పాలి. త‌న వైఖ‌రి వ‌ల్ల త‌న‌కే కాకుండా త‌న కుటుంబ స‌భ్యుల‌కు, చివ‌ర‌కు త‌న సోద‌రుడికి కూడా సంతోషం లేద‌న్న వ్యాఖ్య‌ల‌ను కూడా చేసిన ప‌వ‌న్‌.. త‌న‌దైన వైఖ‌రి చాలా చిత్ర‌మైన‌దేన‌ని కూడా చెప్పుకొచ్చారు.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న తాను... కొంద‌రి ప‌ల్ల‌కీ మోశాన‌ని, అయితే ఆ త‌ర్వాత తానెవరి ప‌ల్ల‌కీ అయితే మోశానో వారే త‌న‌ను నిండి ముంచేశారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది స్వ‌లాభం కోసం కాద‌ని ఏక‌రువు పెట్టిన ప‌వ‌న్‌... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో తాను ఇత‌రులకు మ‌ద్ద‌తిచ్చింది ప్ర‌జ‌ల మేలు కోస‌మేన‌ని కూడా చెప్పారు. అయితే ఆ మేలు ప్ర‌జ‌ల‌కు జ‌ర‌గ‌క‌పోగా... రాష్ట్రంలో అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితులు నెలకొన్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తంగా పార్టీ ఆవిర్భావ స‌భ‌లో త‌న‌దైన శైలి ప్ర‌సంగం చేసిన ప‌వ‌న్‌... దాదాపుగా అన్ని అంశాల‌ను ప్ర‌స్తావించార‌నే చెప్పాలి. ఈ సంద‌ర్బంగా విడుద‌లైన జ‌న‌సేన మేనిఫెస్టోలో ఏఏ అంశాలున్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే...

* రైతు రక్షక భరోసా పథకంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన అన్ని వర్గాల రైతులకు నెలకు రూ.5,000 పింఛను
* రైతుకు ఎకరానికి రూ.8000 సాగు సాయం
* భూములు కోల్పోయిన కుటుంబాలకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లింపు
* రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు
* రాష్ట్ర పారిశ్రామికీకరణలో రైతులకు భాగస్వామ్యం
* తూర్పు - పశ్చిమగోదావరి జిల్లాల కోసం రూ.5,000 కోట్లతో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు
* ప్రతి మండలంలో గోడౌన్లు
* ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
* విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం
* విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ పేరుతో భోజన క్యాంటీన్లు
* ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజక్ట్ సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు
* ఉత్తరాంధ్రలో నదులు అనుసంధానంపై ప్రత్యేక ఏర్పాట్లు
* లంచాలు తీసుకునే వీల్లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
* ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ కోసం ఏడాదికి ఒక్కసారి మాత్ర‌మే ఫీజు కట్టించుకునే విధానం
* మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించేలా చర్యలు
* మహిళలకు పావలా వడ్డీతో రుణాలు అందజేత
* ప్రతి జిల్లాలో మహిళలకు ఆసుపత్రి - ప్రత్యేక బ్యాంకు
* డ్వాక్రా మహిళలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
* ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
* బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తింపు
* ముస్లిం సోదరుల కోసం సచార్ కమిషన్ సిఫార్సులు అమలు