Begin typing your search above and press return to search.

జనసేన తొలి సైనికుడు బాలక్రిష్ణుడు

By:  Tupaki Desk   |   11 Sep 2018 4:30 PM GMT
జనసేన తొలి సైనికుడు బాలక్రిష్ణుడు
X
యుద్దం ఒక చోట జరుగుతుంటే........కత్తిని మరో చోట ఝుళిపిస్తున్నారు జనసేనాని. ముందస్తుగా ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో తమ పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందో - ఉండదో ఇప్ప‌టివరకూప్రకటించలేదు. తనకూ ఆంధ్రప్రదేశ్‌‌ లోను తెలంగాణలోను అభిమానులు ఉన్నారని - తెలుగు ప్రజల కోసం ఎలాంటి త్యాగానికై సిద్దం అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాజధాని హైదారబాదులో జనసేన ప్రధాన కార్యలయాన్ని కూడా ఏర్పాటు చేసారు. ఇక్కడ నుంచే కీలక నిర్ణాయాలన్నీ తీసుకుంటున్నారు. అయితే ముందస్తు ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ పార్టీ ఎత్తుగడను గాని - వ్యూహలను గాని - పొత్తులను గాని ప్రకటించ లేదు. ఎప్పుడో ఏడాది తర్వాత జరిగే ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలకు ఒకే ఒక్క అభ్యర్దితో తొలి జాబితాను విడుదల చేసారు పవన్ కల్యాణ్.

ఆంధ్రప్రదేశ్‌ లో తూర్పుగోదావరి జిల్లాలో తొలి జనసేన పార్టీ అభ్యర్దిని ప్రకటించారు పవన్ కల్యాణ‌్. నిజానికి ఈ ప్రకటనకు సందర్భమూ లేదు - అవసరమూ లేదు. అయిన తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం అభ్యర్దిగా పితాని బాలక్రిష్ణను ప్రకటించారు. ఈయన ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జనసేనలో చేరారు. శేట్టిబలిజ కులానికి చెందిన బిసీ వర్గీయుడైన పితాని బాలక్రిష్ణ పేరు ప్రకటించడం ఒక విధంగా సాహసమే. గత ఎన్నికలను పరిశీలిస్తే పితాని బాలక్రిష్ణ కులానికి చెందిన వారు ఆ నియోజక వర్గంలో గెలిచింది తక్కువే. అయిన పవన్ కల్యాణ్ తొలి అభ్యర్ది ప్రకటన విషయంలోనే ఎందుకో తొందర పడ్డారని రాజకీయ వర్గాలలో అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎన్నికలలకు ఎంతో సమయం ఉంది, ఇప్పటి నుంచే అభ్యర్దులను ప్రకటిచడం రాజకీయంగా మంచి ఎత్తుగడ కాదంటున్నారు. దీని కారణంగా జనసేనలో అభిమానుల కంటే వ్యతిరేకులే ఎక్కువ మంది అవుతారని అంటున్నారు. పైగా కోనసీమలో పవన్ కల్యాణ్ సొంత కులస్థులకు, ముమ్మిడివరం తాజా అభ్యర్ది పితాని బాలక్రిష్ణ కులానికి అస్సలు పొసగదు. ఈ రెండు కులాల మధ్య దశాబ్దాలుగా వైరం ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో పితాని బాలక్రిష్ణ పేరు ప్రకటించడం జనసేనకు కలిసొచ్చే అంశం కాదని చెబుతున్నారు.