Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు పేర్లు వెల్ల‌డి..ఏపీలో ప‌వ‌నే ముందున్నాడు

By:  Tupaki Desk   |   11 March 2019 2:10 PM GMT
ఇద్ద‌రు పేర్లు వెల్ల‌డి..ఏపీలో ప‌వ‌నే ముందున్నాడు
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో - ఆయా పార్టీల అభ్య‌ర్థుల పేర్ల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఎంపీ అభ్య‌ర్థిగా ఎవరిని ఖ‌రారు చేస్తారు..ఏ పార్టీ జాబితా ముందు వెలువ‌డుతుంది అనే చ‌ర్చ‌ స‌ర్వ‌త్రా సాగింది. ఈ జాబితాలో మిగ‌తా ఆప‌ర‌ట్ఈల కంటే ముందు జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిలిచారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్‌ శేఖర్‌ - రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణలు పోటీ చేస్తారని పార్టీ అధినేత ప్రకటించారు.

విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన‌ పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో డీఎంఆర్ శేఖ‌ర్‌తో పాటు అనేక మంది నేత‌లు పార్టీలో చేరారు. వీరంద‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కండువాలు క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ప‌వన్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. "ఓఎన్జీసీలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన డి.ఎం.ఆర్ శేఖ‌ర్ పార్టీలో చేర‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది. 2014 పార్టీ ఆవిర్భావ స‌భ‌కు మిత్రుల‌తో క‌లిసి వ‌చ్చి మ‌ద్ద‌తు తెలిపారు. శేఖ‌ర్ గారితో గ‌త ఏడాదిగా మాట్లాడుతున్నాను. బ‌డుగు - బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు మేలు చేయాల‌న్న ఆయ‌న‌ త‌ప‌న న‌న్ను క‌దిలించింది. ఆయ‌న ఇప్పుడు పార్టీలో చేర‌డం కేవ‌లం ఫార్మాలిటి. జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడే మా మ‌న‌సులు క‌లిశాయి. జ‌న‌సేన పార్టీలోకి వ‌స్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం అని నేను చెప్పిన మాట న‌మ్మి పార్టీలోకి వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు. మీలాంటి ఉన్న‌త మ‌న‌స్త‌త్వం క‌లిగిన‌వారు - బ‌డుగు - బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అండ‌గా ఉండాల‌నుకునే వారు జ‌న‌సేన పార్టీలో చేర‌డం పార్టీకి మ‌రింత బ‌లాన్ని చేకూర్చుతుంది. అలాగే డాక్ట‌ర్.ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌గారి కుటుంబంతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. మా కుటుంబానికి ఎంతో స‌న్నిహితులు. ఉద్ధానం స‌మ‌స్య ప‌రిష్కారం కోసం శ్రీకాకుళంలో నిరాహార దీక్ష చేస్తే నాతో పాటు వాళ్ల కుటుంబం కూడా దీక్ష‌కు కూర్చుంది. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ త‌రుపున పోటీ చేసి రాజ‌మండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి జ‌న‌సేన పార్టీలో జాయిన్ అయిన‌ప్ప‌టి నుంచి అనేక‌మందిని పార్టీలో జాయిన్ చేస్తూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు`` అని కితాబిచ్చారు.

కాగా, జ‌న‌సేన అధినేత పార్టీ కార్య‌క‌లాపాల్లో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. 32 అసెంబ్లీ స్థానాలకు, మ‌రో 7 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను రేపు లేదా ఎల్లుండి ప్ర‌క‌టించ‌నున్నారు. ఇందుకు త‌గిన క‌స‌ర‌త్తును జ‌న‌సేనాని కొన‌సాగిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వామ‌ప‌క్షాలతో పొత్తుల‌కు ఆయ‌న స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు పార్టీ ఆవివిర్భావ స‌భ‌కు జ‌న‌సేన సిద్ధ‌మ‌వుతోంది. మార్చి 14వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జ‌న‌సేన స‌భ జ‌ర‌గ‌నుంది.