Begin typing your search above and press return to search.

బాబు బాట‌లో ప‌య‌నిస్తున్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   10 April 2018 5:11 AM GMT
బాబు బాట‌లో ప‌య‌నిస్తున్న ప‌వ‌న్‌
X
సెల‌బ్రిటీల నోటి నుంచి పేద మాట‌లు రావ‌టం వింటామా? ఛాన్సే ఉండ‌దు. కానీ.. ఈ తీరుకు భిన్నంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. తాను న‌టించే సినిమాల‌కు అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే ఆయ‌న‌.. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవ‌ని చెబుతారు. ఓ నోటితో డ‌బ్బుల్లేవంటూనే.. మ‌రోవైపు ఆయ‌న హంగు అర్భాటం మాత్రం అందుకు భిన్నంగా ఉండ‌టం అస్స‌లు అర్థం కాన‌ట్లుగా ఉంటుంది.

తన ద‌గ్గ‌ర ఫండ్స్ చాలా ప‌రిమితంగా ఉంటాయ‌ని.. మిగిలిన వారి మాదిరి తాను ఫైనాన్షియ‌ల్ గా సౌండ్ కాదంటారు. అలాంటి ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా ఒక భారీ న‌జ‌రానాను ప్ర‌క‌టించారు. కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో వెయిట్ లిఫ్టింగ్ లో స్వ‌ర్ణం సాధించిన తెలుగు లిఫ్ట‌ర్‌.. గుంటూరు జిల్లా కుర్రాడు వెంక‌ట రాహుల్ కు రూ.10ల‌క్ష‌ల న‌జ‌రానాను ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. 85 కేజీల విభాగంలో స్వ‌ర్ణం సాధించిన రాహుల్‌కు.. తాము రూ.10ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వాస్త‌వానికి ఇలాంటివి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేస్తుంటారు. ప్ర‌చారం కోసం.. క్రీడాకారుల‌కు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్న భావ‌న క‌లిగించేలా ఆయ‌న హ‌డావుడి ఉంటుంది.

క్రీడ‌ల కోసం అంత ప్రాధాన్య‌మే బాబు ఇచ్చే మైండ్ సెట్ ఉంటే వార్షిక బ‌డ్జెట్ లో క్రీడ‌ల‌కు ఆయ‌న కేటాయించే మొత్తం చూసిన‌ప్పుడు బాబు మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య తేడా ఇట్టే అర్థ‌మైంది. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా ప‌వ‌న్ న‌జ‌రానా ప్ర‌క‌టించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఒక లిఫ్ట‌ర్ కు భారీ న‌జ‌రానాను పేద ప‌వ‌న్ ఎందుకు ప్ర‌క‌టించారు? దాని వెనుక ఏదైనా కార‌ణం ఉందా? అన్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఎప్పుడూ లేని రీతిలో త‌న మూలాల గురించి ఈ మ‌ధ్య‌న ప‌వ‌న్ త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్నారు. ఈ మ‌ధ్య‌న నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో మాట్లాడుతూ తాను బాప‌ట్ల‌లో పుట్టిన‌ట్లుగా వెల్ల‌డించారు. ఇది పాత విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ నోట నుంచి ఒక బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌స్తావించ‌టం మాత్రం ఇది మొద‌టిసారిగా చెప్పాలి.

తాజాగా కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో స్వ‌ర్ణం సాధించిన రాహుల్ స్వ‌స్థ‌లం స్టువార్టు పురం. ఇది ప‌వ‌న్ పుట్టిన బాప‌ట్ల‌కు చాలా ద‌గ్గ‌ర్లోనే ఉంటుంది. ప‌ది కిలోమీట‌ర్ల కంటే త‌క్కువ దూరంలోనే ఉంటుంది. తాను పుట్టిన ఊర్లో త‌న‌కు ఇప్ప‌టికే లేని స‌రికొత్త ఇమేజ్ ను పెంచుకోవ‌టం.. ఆ ఊరి ప‌ట్ల తాను ప్ర‌త్యేక‌మైన అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న భావ‌న క‌లిగించేందుకే తాజా న‌జ‌రానా అన్న మాట వినిపిస్తోంది. ఏమైనా త‌ర‌చూ త‌న ఆర్థిక ప‌రిస్థితి గురించి అయ్యో అనిపించేలా చెప్పుకునే ప‌వ‌న్‌.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించ‌టం ఆస‌క్తిక‌రమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.