Begin typing your search above and press return to search.

జనాల్ని మభ్యపెట్టకు.. పవన్‌ కల్యాణ్‌

By:  Tupaki Desk   |   13 April 2016 4:21 AM GMT
జనాల్ని మభ్యపెట్టకు.. పవన్‌ కల్యాణ్‌
X
పవన్‌ కల్యాణ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు అనేవి ఇవాళ్టికి నిన్నటి వార్తలు అయిపోయాయి. ఇప్పుడు వాటిని ఒక కొత్త కోణంలోంచి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాన్నాళ్లుగా ఏటీవీ ఛానల్‌ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వని పవన్‌ కల్యాణ్‌ ఒకేసారి మూకుమ్మడిగా అందరినీ పిలిచి.. తన యావత్‌ జీవితాన్ని తెరచిన పుస్తకంలాగా వారితో పంచుకోవడానికి ఎందుకింత సామూహిక ఇంటర్వ్యూలు ఇచ్చారు? తన సంగతులు చెప్పుకునే ఆసక్తితో ఎంతమాత్రమూ కాదు. కేవలం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న తన చిత్రం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ప్రమోషన్‌ కు ఈ ఇంటర్వ్యూలు ఉపకరిస్తాయనే ఉద్దేశంతో మాత్రమే.

సాధారణంగా హీరోలు.. (మీడియాకు దూరంగా ఉండేవారు కూడా) తమ చిత్రాల విడుదలకు ముందు ఇలాంటి వరుస ఇంటర్వ్యూలు ఇస్తారు. పవన్‌ కల్యాణ్‌ వెరైటీ ఏంటంటే.. విడుదల అయి రెండు రోజుల తర్వాత అందరినీ ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. అసలు సర్దార్‌ రిపోర్ట్‌ బాగా పాజిటివ్‌ గా వచ్చి ఉంటే.. అసలు ఈ ఇంటర్వ్యూలే ఉండేవి కాదు. రిపోర్ట్‌ బాక్సాఫీసు వద్ద నెగటివ్‌ అని రాబట్టే.. కాస్త హైప్‌ క్రియేట్‌ చేయడానికి ఈ తంతు అని అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే.. ఆయన సినిమా ప్రమోషన్‌ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చినా.. వెళ్లిన వారంతా.. ప్రధానంగా రాజకీయాంశాల గురించి అనేక ప్రశ్నలు సంధించారు. 2019లో ఎన్నికల బరిలోకి వచ్చేస్తున్నా అనే స్పష్టత మాత్రం పవన్‌ ఇచ్చారు. అయితే తన వద్ద ప్రస్తుతం స్టాఫ్‌ కు జీతాలివ్వడానికి కూడా డబ్బుల్లేవు అంటూ పేదరికాన్ని కూడా బయటపెట్టారు.

అప్పుడు అసలు విషయానికి వస్తే.. సాధారణంగా ఏ పార్టీ అయినా కనీసం అయిదారేళ్ల క్షేత్రస్థాయి కసరత్తు నిర్మాణం కార్యకర్తల తర్ఫీదు పార్టీ ఆలోచనల్ని - ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం లాంటి ప్రయత్నాలు లేకుండా సక్సెస్‌ కావడం జరగదు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం సక్సెస్‌ అనేది ఇలాంటి సిద్ధాంతాలకు అతీతమైన విజయం. అయితే మెగాస్టార్‌ చిరంజీవి పార్టీ - ఇదే పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేసిన పార్టీ ఎంత దెబ్బతిన్నదో అందరికీ తెలుసు. అయినా సరైన వ్యవధిలేకుండా, ఇప్పటిదాకా కనీస కసరత్తుపై దృష్టి లేకుండా పవన్‌ తాను 2019 ఎన్నికలకు రెడీ అనడం ఆపద్ధర్మంగా సంచలనం కోసం చెబుతున్న డైలాగు మాత్రమే అనేది పలువరి అంచనా.

రాజకీయ డైలాగు సంధించడం ద్వారా మార్కెట్ లో ఉన్న సినిమాకు హైప్‌ సృష్టించుకోవడం సినిమా రంగం అనుసరించే చవకబారు టెక్నిక్కుల్లో ఒకటి. ఇందులో రజనీకాంత్‌ కూడా సిద్ధహస్తుడే. ప్రస్తుతం పవన్‌ కూడా అదే పని చేస్తున్నారని అనిపిస్తుంది. పైగా తన వద్ద జీతాలకు కూడా డబ్బుల్లేవు అంటూ పేదరికపు డైలాగులేంటో అర్థం కాదు. దీనిద్వారా 2019 ఎన్నికల్లో తాను బరిలోకి రాకపోయినా.. దానికి ఒక సమర్థింపును ఇప్పటినుంచే తయారుచేసుకుంటున్నాడని అనుకోవాలా?

మొత్తానికి సినిమా ప్రమోషన్‌ అనే ఒకే ఒక లక్ష్యంతో అటు రాజకీయ, కులపరమైన వివాదాలన్నిటి గురించీ మాట్లాడేసిన పవన్‌ కల్యాణ్‌.. కలెక్షన్ల గ్రాఫ్‌ ను ఈ ఇంటర్వ్యూలతో ఎంతమేర లేపి నిలబెడతారోచూడాలి.