Begin typing your search above and press return to search.

బాబు స్కెచ్ కు దెబ్బ: ఓకే అన్న పవన్

By:  Tupaki Desk   |   21 July 2017 11:13 AM GMT
బాబు స్కెచ్ కు దెబ్బ: ఓకే అన్న పవన్
X
పవన్ కల్యాణ్ ఎలా స్పందించారో అధికారికంగా తెలియదు. కానీ ఏపీ సీఎంతో భేటీ కావడానికి ఆయనను ఒప్పించే ప్రయత్నాలను చంద్రబాబు కోటరీ మాత్రం అలుపెరగకుండా సాగించింది. మొత్తానికి తాజాగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి చంద్రబాబుతో భేటీ కావడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారు. ఈ భేటీకి ముహూర్తం కుదిరింది! ప్రస్తుతం బల్గేరియా షూటింగ్ లో ఉన్న ఆయన అక్కడినుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈనెల 31న విజయవాడలో చంద్రబాబుతోను - హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చే వైద్యుల బృందంతోను భేటీ అయి ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య గురించి చర్చిస్తారు.

ఉద్ధానం కిడ్నీ బాధితులను పరామర్శించిన తర్వాత.. వారికి సాయం గురించి చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన పవన్ కల్యాణ్ కొంతమేర సక్సెస్ సాధించారు. అలాగే పవన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించినప్పుడు, అక్కడి వైద్యుల ఎదుట కూడా ఈ సమస్యను ఉంచారు. దానికి స్పందనగా ఇప్పుడు అక్కడి వైద్యుల బృందం రావడం జరుగుతోంది. పవన్ - చంద్రబాబులతో భేటీ తర్వాత వారు ఉద్ధానం వెళ్లి అక్కడి స్థితిగతులను కూడా పరిశీలిస్తారు.

బాబు స్కెచ్ కు దెబ్బపడింది!

పవన్ కల్యాణ్ తో భేటీ కావడం, ఉద్ధానం సమస్య గురించి చర్చించడం ద్వారా చంద్రబాబునాయుడు ఆశించిన పొలిటికల్ మైలేజీకి గండి పడిందని పలువురు అంచనా వేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పిలుపు ఇచ్చిన రోజు కంటె ముందే పవన్ తో భేటీ అయితే గనుక - పవన్ తో ప్రభుత్వ అనుకూల ప్రకటనలు - తన సమక్షంలో చేయించగలిగితే గనుక, కాపు సామాజిక వర్గంలో తనకు ఎడ్వాంటేజీ ఉంటుందని చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకే ఒకవైపు రాష్ట్రపతి ఎన్నిక హడావిడి ఉన్నప్పటికీ.. ఈనెల 17న పవన్ తో భేటీకి ప్రయత్నించారు. అప్పట్లో స్పందించని పవర్ స్టార్.. 31వ తేదీ సమావేశం కావడానికి రానున్నట్లు తెలుస్తోంది. ఈలోగా ముద్రగడ పాదయాత్ర కూడా అయిపోతుంది. ఆరోజున కాపుల పట్ల ప్రభుత్వం ఎంత దాష్టీకం ప్రదర్శిస్తుందో, ఎంత అమానుషంగా ప్రవర్తిస్తుందో.. ఇవన్నీ కలిపి సీఎంతో భేటీకి వచ్చే పవన్ ఆలోచనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచిచూడాలి.