Begin typing your search above and press return to search.

పవన్ బీజేపీల మధ్యలో....రోడ్ మ్యాప్ ఎక్కడ పోయింది....?

By:  Tupaki Desk   |   20 April 2023 8:00 AM GMT
పవన్ బీజేపీల మధ్యలో....రోడ్ మ్యాప్ ఎక్కడ పోయింది....?
X
రోడ్ మ్యాప్ ఈ పదం బీజేపీ జనసేనల మధ్య అటూ ఇటూ తిరుగుతోంది. మీరు రోడ్ మ్యాప్ ఇవ్వండి వైసీపీని దించేస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్పి ఏడాది పై దాటింది. గత ఏడాది జనసేన ఆవిర్భావ సభలో పవన్ కీలక ప్రకటన చేశారు ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లను అన్నీ చీలకుండా తాను చూస్తాను అని అన్నారు.

ఏపీలో వైసీపీ లేని పాలన తీసుకునివస్తానని ప్రజలకు చెప్పారు. తన మిత్ర పక్షం బీజేపీని ఈ విషయంలో రోడ్ మ్యాప్ చాలా కాలం క్రితమే అడిగాను అని వారు ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం వేచి చూస్తున్నానని కూడా అన్నారు. అయితే ఆ తరువాత ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు రోడ్ మ్యాప్ అన్నది పవన్ కి ఎపుడో ఇచ్చేశామని అన్నారు.

అయినా సరే పవన్ కళ్యాణ్ గత ఏడాది మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశలోనూ, ఈ ఏడాది మార్చిలో మచిలీపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ రోడ్ మ్యాప్ బీజేపీ ఇవ్వకపోవడం వల్లనే ఏపీలో తమ రెండు పార్టీల ఆల్టర్నేషన్ బలంగా జనంలోకి వెళ్ళలేదని ఆక్షేపించారు. అదంతా బీజేపీ తప్పుగానే ఆయన పేర్కొన్నారు.

దాంతో పాటు బీజేపీతో పొత్తు తెంచుకుంటామని, మైనారిటీలకు హాని జరిగితే మాత్రం ఒక్క క్షణం తమ మిత్ర బంధం ఉండదని హాట్ కామెంట్స్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసే సమయంలో కూడా రోడ్ మ్యాప్ గురించే ప్రస్తావించారని ప్రచారం సాగింది. పవన్ కోరుతున్న బీజేపీ మ్యాప్ ఏంటి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలసికట్టుగా ఎన్నికలకు వెళ్ళడం.

కానీ బీజేపీ పెద్దల నుంచి ఈ రోజు దాకా ఏ రకమైన హామీ లభించలేదని అంటున్నారు. ఇక ఇపుడు చూస్తే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ డియోధర్ కూడా సోము వీర్రాజు మాటలనే మరో మారు వల్లించారు. పవన్ కి రోడ్ మ్యాప్ ఎపుడో ఇచ్చామని చెప్పేశారు. రోడ్ మ్యాప్ కి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా పవన్ కే వేయాలి తప్ప తమని కాదని ఆయన బదులివ్వడం విశేషం.

ఇక పవన్ కి ఎలాంటి రోడ్ మ్యాప్ ఇచ్చామన్నది ఆయన చెప్పలేదు. అది పవనే చెప్పలంటూ దాటవేయడం జరిగింది. అంతే కాదు ఒక టీవీ చానల్ దీని మీద రెట్టించి ప్రశ్నించినా ఆయన ధన్యవాద్ నంస్కారములు అంటూ కారెక్కి వెళ్ళిపోయారు. మరి ఏపీ బీజేపీ వ్యవహారాలను చూస్తున్న బీజేపీ పెద్ద మనిషి మిత్ర పక్షమైన జనసేన విషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారా లేక ఇలా మాట్లాడడమే వ్యూహం అనుకుంటున్నారా అన్నది తెలియడంలేదు అన్న మాట వినిపిస్తోంది.

ఏపీలో చూస్తే తెలుగుదేశంతో కలసి వెళ్లాలని జనసేన చూస్తోంది. బీజేపీని కూడా కలసి రమ్మంటోంది. కానీ అది తమకు సమ్మతం కదని బీజేపీ జనసేనల పొత్తు మాత్రమే ఉండాలని ఆ పార్టీ అంటోందని టాక్. బహుశా బీజేపీ పవన్ కి ఇచ్చిన రోడ్ మ్యాప్ అదేనని అంటున్నారు. అందుకే సునీల్ డియోధర్ కూడా పవన్నే రోడ్ మ్యాప్ గురించి అడగమని చెబుతున్నారని కూడా అంటున్నారు.

మరో వైపు సునీల్ డియోధర్ ఇంకో కామెంట్ చేశారు. ఏపీలో బీజేపీ పుంజుకుంటోందని, మాజీ సీఎం మూడేళ్ల పాటు ఉమ్మడి ఏపీని ఏలిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీలో చేరారని దాంతో ఏపీలో పటిష్టం అయ్యామని చెబుతున్నారు. అంటే జనసేన మిత్ర బంధం ఉన్నా లేకపోయినా తమకు ఏపీలో బలం పెరుగుతోందని సునీల్ డియోధర్ భావిస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తూంటే అటు జనసేన అసహనంతో ఉంది. ఇటు బీజేపీ పవన్ మీద అనుమానంతో ఉంది. మరి ఈ రెండు పార్టీల పొత్తు పెటాకులు అయ్యేందుకు తగిన సమయం కోసమే ఎదురుచూస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.