Begin typing your search above and press return to search.

అనంతపురం సభకు పేరు పెట్టేసిన పవన్

By:  Tupaki Desk   |   26 Oct 2016 3:22 PM GMT
అనంతపురం సభకు పేరు పెట్టేసిన పవన్
X
స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అన్నట్లుగా ఉంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి చూస్తుంటే. గతంలో పోలిస్తే.. ఇప్పుడాయన నిర్ణయాల్లో కొద్దిపాటి స్థిరత్వం కనిపిస్తోంది. హైదరాబాద్ లో వర్షం రాకడ.. పవన్ కల్యాణ్ రాజకీయ నిర్ణయం ఒకేలా ఉంటాయన్న జోకులు ఇకపై బంద్ కావొచ్చు. ఒకటి తర్వాత ఒకటిగా ఆయన వేస్తున్న అడుగులు చూస్తుంటే.. రాజకీయంగా పవన్ తానేం చేయాలన్న విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది.

మొన్నటికి మొన్న గోదావరి ఆక్వాఫుడ్ పార్క్ ఇష్యూను తెర మీదకు తీసుకొచ్చి.. మెరుపులా మెరిసిన పవన్ కల్యాణ్.. రెండు రోజుల క్రితం అనంతపురంలో తాను నిర్వహించబోయే బహిరంగ సభ గురించి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తాను విడిచిపెట్టలేదని.. ఈ అంశాన్ని సాధించే వరకూ తాను ఊరుకునేది లేదన్న విషయాన్ని తన తాజా ప్రకటనతో మరోసారి స్పష్టం చేయటంతో పాటు.. వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హోదా మీద మొదటి బహిరంగ సభను ఏపీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయన.. తర్వాతి సభను టీడీపీకి బలం భారీగా ఉన్న గోదావరి జిల్లాలో ఏర్పాటు చేశారు. తాజాగా కరవు జిల్లాగా.. విభజన నిర్ణయం తర్వాత రగిలిపోయిన మొదటి జిల్లా అయిన అనంతపురం జిల్లాను ఆయన ఎంచుకున్నారు.

తాజా నిర్ణయంతో ప్రత్యేక హోదా మీద తాను ప్రతి జిల్లాలోనూ ఒక బహిరంగ సభను రెండు నెలలకు ఒకటి చొప్పున నిర్వహించే అవకాశం ఉందన్న సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పుకోవాలి. రెండు రోజుల క్రితం హోదా మీద భారీ బహిరంగ సభను ప్రకటించిన పవన్.. తాజాగా ఆ సభకు పేరు పెట్టటం ద్వారా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. నవంబరు 10న అనంతపురంలో నిర్వహించే సభకు.. ‘‘సీమాంధ్ర హక్కుల చైతన్య సభ’’గా పేరు పెట్టారు. అంతేకాదు.. వేదికను కూడా నిర్ణయించారు. అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సభ జరుగుతుందని ప్రకటించిన ప్రకటనలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సభా ప్రాంగణానికి విప్లవ నేత తరిమెల నాగిరెడ్డి పేరును.. సభా వేదికకు స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు పేర్లను పవన్ ఖరారు చేయటం గమనార్హం. వారిద్దరి పేర్లను ఈ సందర్భంగా స్మరించుకోవటం తమకు దక్కిన భాగ్యంగా పేర్కొనటం ద్వారా.. అనంతపురం వాసుల మనసుల్ని పవన్ దోచుకునే ప్రయత్నం చేశారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/