Begin typing your search above and press return to search.

మ‌న‌షులను విడదీసే రాజ‌కీయం చేయ‌వ‌ద్దుః ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   31 July 2017 12:42 PM GMT
మ‌న‌షులను విడదీసే రాజ‌కీయం చేయ‌వ‌ద్దుః ప‌వ‌న్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడుతో స‌మావేశం అనంత‌రం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మీడియాతో పవన్‌ మాట్లాడుతూ అనేక అంశాల‌పై స్పందించారు. పార్టీ సాపించిన తర్వాత ఏపీ రాజధానిలో ఇదే నా తొలి ప్రెస్‌మీట్ అని తెలిపారు. ఉద్దానం సమస్యపై సీఎం సానుకూలంగా స్పందించారని ప‌వ‌న్ తెలిపారు. బాధితులను కలిసి వారిలో కొంత ఉత్సాహం కలిగించానన‌ని, అనంత‌రం ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి నా వంతు కృషి చేశానని ప‌వ‌న్ పేర్కొన్నారు. శతాబ్దాలుగా ఉద్దానంలో కిడ్నీ సమస్యను మీడియా ముందుకు తీసుకొచ్చిందని ప‌వ‌న్ ప్ర‌శంసించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల వేదనను ప్రపంచానికి తెలియజేశామన్నారు. ఉద్దానం సమస్యను రాజకీయం చేయదలుచుకోలేదని.. రాజకీయాలకు అతీతంగా ఉద్దానం సమస్యను చూడాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.మానవతా కోణంలోనే ఈ సమస్యపై పోరాడుతున్నానని అన్నారు.

గరగపర్రు లాంటి విషయాలపై తాను ఇప్పటి వరకు మాట్లాడలేదని ఎందుకంటే ఇలాంటి అంశాలు సమాజాన్ని విడదీస్తాయని పవన్‌కల్యాణ్ తెలిపారు. సున్నితమైన అంశం కాబట్టే తాను మాట్లాడలేదని గ‌రగపర్రులాంటి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించాలని ప‌వ‌న్ అన్నారు. అంబేద్కర్‌, అల్లూరీలు ఒక వర్గానికి చెందిన నాయకులు కాదన్నారు. మనుషులను విడగొట్టే రాజకీయాలు చేయొద్దన్నారు. సమాజాన్ని కలగలిపే రాజకీయాలు చేయాలని జ‌న‌సేనాని కోరారు. ప్రజా సమస్యలపై జనసేన తరుపున పోరాడతానని పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రజా సమస్యలను ఇక ప్రత్యక్షంగా తెలుసుకుంటానన్నారు. గోదావరి అక్వా పార్కు నిర్మాణంలో నిబంధనలు పాటిస్తున్నారా అని పవన్‌ ప్రశ్నించారు. స్థానిక మ‌త్య్య‌కారుల బాగోగుల‌ను ప‌ట్టించుకునేలా రాజ‌కీయాలు ఉండాల‌న్నారు. చేనేత కార్మికులకు ప్రోత్సాహకం ఇవ్వాలని, జీఎస్టీ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడాల‌ని సీఎం చంద్రబాబునాయుడును కోరానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు.

అనాథలవుతున్న చిన్నారుల దత్తతపై చొరవ తీసుకోవాలని సీఎంను కోరినట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. చిన్నారుల దత్తతపై సీఎం చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఉద్దానంలో రీసెర్చ్‌ సెంటర్‌ పెట్టాలని సీఎంను కోరానన్నారు. రీసెర్చ్‌ సెంటర్‌ పెడితే హార్వర్డ్‌ వైద్యులు కలిసి చేస్తామని చెప్పినట్లు పవన్‌ తెలిపారు.