Begin typing your search above and press return to search.

పవన్ కు చాలా ఇబ్బందికరమైన పరిస్ధితే!!

By:  Tupaki Desk   |   27 Nov 2020 1:01 PM GMT
పవన్ కు చాలా ఇబ్బందికరమైన పరిస్ధితే!!
X
అవును ఇపుడీ ప్రశ్న విన్నవారికి ఆశ్చర్యంగా ఉండచ్చు. కానీ ఇపుడీ ప్రశ్నను వేసుకోవాల్సిన అసవరం వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసి) ఎన్నికల్లో జనసేన పోటీ నుండి విరమించుకుని బీజేపీకి ప్రచారం చేయటానికి రెడీ అయిపోయింది. ముందు జనసేనే పోటీ చేస్తుందని అధినేత పవన్ కల్యాన్ ప్రకటించటం తర్వాత బీజేపీ నేతలు మాట్లాడటం తెలిసిందే. అభ్యర్ధుల జాబితాను విడుదల చేసిన తర్వాత హఠాత్తుగా పవన్ మాట మార్చేసి కమలం పార్టీకి ప్రచారానికి ఒప్పేసుకున్నారు.

సరే ఏదో అవసరార్ధం పోటీనుండి విరమించుకుని ప్రచార బాధ్యతలు తీసుకున్నారనే అనుకుందాం. గ్రేటర్ ఎన్నికల్లో పవన్ ఏమని ప్రచారం చేస్తారు ? అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే కేసీయార్ కు వ్యతిరేకంగా పవన్ సంవత్సరాలుగా ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. మరి కేసీయార్ అంటే భయమో ఏమో తెలీదు కానీ టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయాలన్నా - విమర్శించాలన్నా ఎందుకో పవన్ వెనకాడుతున్నారు. ఈ కారణం వల్లే తెలంగాణాలో జరిగిన ఏ ఎన్నికల్లోను జనసేన పోటీ చేయలేదు.

ఇదే సమయంలో బీజేపీ ఏమో కేసీయార్ అంటే ఒంటికాలిపై లేస్తోంది. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అంటు బీజేపీ నేతలు తొడ కొడుతున్నారు. కమలనాదులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నది మాత్రం వాళ్ళే అన్నది వాస్తవం. దీనికి తోడు దుబ్బాక ఉపఎన్నికలో గెలవటంతో ఇక వాళ్ళను పట్టడం ఎవరి వల్లా కావటం లేదు. దుబ్బాక వేడి చల్లారకముందే జీహెచ్ఎంసి ఎన్నికలు వచ్చేయటంతో ఇక గ్రేటర్ పరిధిలో బీజేపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. అందుకనే కేసీయార్ పై ఆరోపణలు - విమర్శలు చేయటంలో బీజేపీ నేతలకు ఆకాశమేహద్దుగా చెలరేగిపోతున్నారు.

మరి వీళ్ళకు పవన్ వైఖరి టోటల్ గా డిఫరెంట్ అనే చెప్పాలి. కేసీయార్ పై ఆరోపణలు - విమర్శలు చేయాలంటేనే పవన్ కు నోరు పెగలదు. ఇలాంటి పరిస్దితుల్లో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున ఏమి ప్రచారం చేస్తారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రతిపక్షాల్లో ఎవరు ప్రచారం చేయాలన్నా కేసీయార్ ను మాత్రమే టార్గెట్ చేయాలి. ఒకవైపు బీజేపీ నేతలు కేసీయర్ పై రెచ్చిపోతుంటే అదే వేదికపై నుండి మాట్లాడే పవన్ కూడా కేసీయార్ ను టార్గెట్ చేయగలరా ?

నిజానికి గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్ధితనే చెప్పాలి. బీజేపీకి ప్రచారం చేయకుండా ఉండలేరు. ఎందుకంటే పోటీనుండి విరమించుకునే సమయంలో తానే బహిరంగంగా కమిట్ అయ్యారు కాబట్టి. అలాగని కేసీయార్ ను మనస్పూర్తిగా టార్గెట్ చేయలేరు. మరి తన ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేస్తారో ? ఎవరిపై ఆరోపణలు, విమర్శలు చేస్తారో చూడాల్సిందే.