Begin typing your search above and press return to search.

పవన్ ఎంట్రీతో గ్రేటర్ ఎన్నికల గేమ్ ప్లాన్ మారిపోనుందా?

By:  Tupaki Desk   |   8 Oct 2020 7:15 AM GMT
పవన్ ఎంట్రీతో గ్రేటర్ ఎన్నికల గేమ్ ప్లాన్ మారిపోనుందా?
X
అంచనాలు అంటూ లేని వారి బరిలోకి దిగినప్పుడు.. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. విజేత తామేనని డిసైడ్ అయి.. జబ్బలు చరుచుకునే వారికే ఇబ్బంది అంతా. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కు జరిగే ఎన్నికల విషయంలో ఇలాంటి సీనే చోటు చేసుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో తమకు వందకు పైగా స్థానాలు ఖాయమని తెలంగాణ అధికారపక్షం చెబుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు గులాబీ నేతలంతా వందకు పైగా స్థానాలే లక్ష్యమన్న మాట తరచూ వారి నోటి నుంచి వస్తోంది.

ఇలాంటి వేళ.. వారి గేమ్ ప్లాన్ లో లేని ఒక పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఇంతకాలం కామ్ గా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని 50 డివిజన్లలో పార్టీ కమిటీలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పవన్ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉలికిపాటుకు గురి చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే.. పవన్ తాజా నిర్ణయాన్ని చూసినప్పుడు.. ఆయన బీజేపీతో పొత్తు పక్కా అన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటికే ఏపీలో బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైన వేళ.. గ్రేటర్ లోనూ బీజేపీతో కలిసి చెట్టాపట్టాలు వేయటానికి ఆయనకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. మారిన నాయకత్వంతో తెలంగాణలో తమ సత్తా ఏమిటో చాటలని తపిస్తున్న బీజేపీకి.. పవన్ ప్లస్ అవుతారని చెప్పక తప్పదు.

దీనికి తోడు.. బీజేపీ ఒక్కతే ఒంటరిగా బరిలోకి దిగే కన్నా.. పవన్ లాంటి జనాదరణ ఉన్న నేత జత కలిస్తే.. తాము మరింతగా చెలరేగిపోవటానికి అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు.. తెలంగాణలోనూ.. అందునా హైదరాబాద్ మహానగరంలో పవన్ కు ఫాలోయింగ్ ఎక్కువే. మరి ముఖ్యంగా యూత్ లో ఆయనంటే క్రేజ్ ఇప్పటికి నిలిచి ఉంది. ఓవైపు మోడీ ఛరిష్మా.. మరో వైపు పవన్ పవర్ జత కలిస్తే.. కేసీఆర్ కు కొత్త చిక్కులు తప్పవన్న మాట వినిపిస్తోంది. సెటిటర్ల ఓట్లు ఇప్పటివరకు ఎవరి ఖాతాలోకి వెళతాయన్న దానిపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు పవన్ ఎంట్రీతో మారిపోతాయని చెప్పక తప్పదు. మొత్తంగా గ్రేటర్ ఎన్నికల్లో పవన్ ఎంట్రీ.. గులాబీ బాస్ కు అంతో ఇంతో గుబులు పుట్టించటం ఖాయమని చెప్పక తప్పదు. గతంలో మాదిరి వంద ప్లస్ సీట్లు అనే మాటను ధీమాగా చెప్పే పరిస్థితి అయితే ఉండదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.