Begin typing your search above and press return to search.

ఓ దరిద్రపు, నీచ, నికృష్ట వాదన అంటూ మద్యం ధరల పెంపుపై పవన్ ఫైర్

By:  Tupaki Desk   |   15 March 2022 5:02 AM GMT
ఓ దరిద్రపు, నీచ, నికృష్ట వాదన అంటూ మద్యం ధరల పెంపుపై పవన్ ఫైర్
X
ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపటం అందరూ చేసేదే. కానీ.. దాన్ని అందరిని ఆకర్షించేలా చెప్పటం చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటారు. తన మాటలతో ఇట్టే కనెక్టు అయ్యేలా చేయటంలో నేతలు చేసే తప్పులకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని మెరుపుల్ని చూస్తే.. ఆయన టీం చేసిన భారీ కసరత్తు ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో జగన్ ప్రభుత్వం వినిపించే వాదనలపై విరుచుకుపడే క్రమంలో.. పవన్ చేసిన ఘాటు విమర్శలు విన్నంతనే నిజమే కదా? ఇందులో విషయం ఉందన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి.

ప్రజలకు చౌకైన వినోదం కోసం సినిమా టికెట్ల ధరల్ని సులభ్ కాంప్లెక్స్ ధరల కంటే తక్కువగా చేయటం.. అదే సమయంలో మద్యం ధరల్ని భారీగా పెంచేస్తే.. మద్యపానానికి దూరమవుతారన్న సిత్రమైన వాదనలు జగన్ సర్కారు సొంతం. చౌకైన వినోదం పేరుతో గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చే వైసీపీ బ్యాచ్.. మరి దేవుడి దర్శనం కోసం.. తాము అమితంగా ఆరాధించే ఇలవేల్పు సేవల విషయంలో భారీగా ధరల్ని పెంచేందుకు వెనుకాడని వైనం దేనికి నిదర్శనం? అన్న మాటకు మాత్రం సమాధానం లభించని పరిస్థితి.

ఏపీలో మద్యం ధరల్ని భారీగా పెంచటం ద్వారా ప్రజల్ని మద్యాపానానికి దూరం చేయొచ్చన్న విచిత్రమైన వాదనపై పవన్ కల్యాణ్ తాజాగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ వాదనలో ఎంత లోపం ఉందన్న విషయాన్ని గణాంకాల రూపంలో తేల్చి చెప్పటమే కాదు.. ఈ తీరును ఇప్పటివరకు ఎవరూ చేయని తీవ్ర విమర్శతో పాటు సంచలన ఆరోపణ చేశారు.

"ధరలు పెంచితే మద్యం తాగేయడం మానేస్తారని ఓ దరిద్రపు, నీచ, నికృష్ట వాదన వినిపిస్తారు. నాసిరకం లిక్కర్‌ అమ్ముతున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 12 మంది మరణించారు. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ కాదు.. అది ఇడుపులపాయ ఫారిన్‌ లిక్కర్‌! 25వేల కోట్ల మద్యం ఆదాయం వారి జేబుల్లోకి చేరుకుంది" అని మండిపడ్డారు.

అంతేకాదు టీడీపీ హయాంలో మద్యంపై రూ.59 వేల కోట్ల ఆదాయం రాగా.. వైసీపీ రెండున్నరేళ్లలోనే రూ.45వేల కోట్లు సంపాదించిందన్నారు. అంతేకాదు.. వైసీపీ నేతలు పెట్టబడులను చంపేశారని.. ఏపీ అంటే ఎవరూ రావటం లేదని.. ఉన్న వాటిని పంపించేస్తున్నారన్నారు. అమర్ రాజా కంపెనీ ఇందుకు ఉదాహరణగా చెప్పారు. అనంతపురం జిల్లాలో కియాతో రావాల్సిన అనుబంధ పరిశ్రమలు రావటం లేదన్న పవన్.. పార్టీ రంగుల కోసం జగన్ ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

వైసీపీ పార్టీ రంగుల కోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేశారని.. ప్రకటనలకు రూ.400 కోట్లు వేస్ట్ చేశారన్నారు. "మీ పార్టీ రంగులు వేసుకోవటానికి రూ.3వేల కోట్లు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇవ్వటానికి డబ్బులు ఉండవా?" అని ప్రశ్నించారు. వైసీపీ న్యాయ వ్యవస్థను తప్పుపట్టే వరకు వెళ్లిందని.. హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్ ఆఫీసుగా మారిందని తిడతారా? ఏ స్థాయికి వీరి గూండాయిజం వెళ్లిందంటే ఇళ్లల్లోకి వచ్చి రైతుల్ని కొట్టటం.. న్యాయవ్యవస్థ జీవితంలోకి వెళ్లటం వీరి గూండాయిజం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.