Begin typing your search above and press return to search.

తిరుపతి సీటు మీద పవన్ కన్ను?

By:  Tupaki Desk   |   24 Nov 2020 9:50 AM GMT
తిరుపతి సీటు మీద పవన్ కన్ను?
X
త్వరలో జరిగే తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయటానికి జనసేన చేస్తున్న కసరత్తు అంతా ఇంతా కాదు. సొంతంగా బరిలో నిలిచే బలం లేని పవన్ కల్యాణ్.. అసరా కోసం బీజేపీతో కలిసి నడిచేలా ఒప్పందం చేసుకోవటం తెలిసిందే. ఒకప్పుడు బీజేపీ నేతల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన జనసేనాని.. ఈరోజు తాము పోటీ చేయటానికి టికెట్ కోసం అదే పనిగా అడగాల్సిన పరిస్థితి. అలా అని తిరుపతిలో బీజేపీకి సొంతంగా బలం ఉందా? అంటే అదీ లేదు. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో తిరుపతి బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 16వేలు మాత్రమే. వారితో పోలిస్తే.. జనసేన ఎంతో మెరుగు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వేళ.. పార్టీ అధినేత హోదాలో చిరంజీవి పోటీ చేయటం.. గెలుపొందటం తెలిసిందే. పవన్ సామాజిక వర్గమైన కాపుల బలం ఆ నియోజకవర్గంలో ఎక్కువ. ఇలాంటి కలిసి వచ్చే అంశాల్ని ప్రస్తావిస్తూ.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయటానికితమకు అవకాశం ఇవ్వాల్సిందిగా బీజేపీ అధినాయకత్వాన్ని కోరేందుకు జనసేనాని ఢిల్లీ వెళ్లారంటున్నారు. పవన్ చేపట్టే ప్రతి కార్యక్రమ వివరాల్ని వెల్లడించే జనసేన పార్టీ.. తాజా ఢిల్లీ పర్యటన గురించి అస్సలు ప్రస్తావించటం లేదు. ఆ మాటకు వస్తే.. ఈ టూర్ షెడ్యూల్ ను గోప్యంగా ఉంచుతున్నారు.

ఢిల్లీకి వెళ్లిన జనసేనాని.. తన వెంట నాదెండ్ల మనోహర్ ను తీసుకెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఆయన భేటీ కానున్నారు. వీలైతే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ సందర్భంగా తిరుపతి సీటును తమకు కేటాయించటం ద్వారా.. తమకున్న గెలుపు అవకాశాల్ని పవన్ వివరిస్తారని చెబుతుననారు. తిరుపతి ఎంపీ నియోజకవర్గంలో తిరుపతితో పాటు శ్రీకాళహస్తిలోనూ కాపులకు బలమైన ఓటు బ్యాంకు ఉండటం.. ఈ సందర్భంగా బీజేపీ కంటే జనసేన గట్టి పోటీ ఇస్తుందన్న విషయాన్ని వారికి చెప్పి.. ఒప్పించాలన్న ప్రయత్నంలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీ పెట్టిన కొత్తల్లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని నేరుగా కలిసి.. ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యే స్థాయి నుంచి ఈ రోజున పార్టీ జాతీయ అధ్యక్షుడితో టికెట్ తమకు ఇవ్వాలని కోరే పరిస్థితికి పవన్ వెళ్లటం చూస్తే.. ఆయన వ్యూహలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా మొన్నటికి మొన్న గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి.. అంతలోనే పోటీ నుంచి తప్పుకోవటం లాంటి పొరపాట్లు చూస్తే.. పవన్ కల్యాణ్ ఇప్పటికి పాఠాలు నేర్వటం లేదా? అన్న సందేహం రాక మానదు. మరి.. పవన్ కోరినట్లుగా కమలనాథులు.. తిరుపతి సీటును జనసేనకు కేటాయిస్తారో లేదో?