Begin typing your search above and press return to search.

తిరుపతి సీటును ఎందుకు వదులుకున్నది చెప్పిన పవన్

By:  Tupaki Desk   |   4 April 2021 6:30 AM GMT
తిరుపతి సీటును ఎందుకు వదులుకున్నది చెప్పిన పవన్
X
ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. మండే ఎండలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల జోరు ఒకవైపు.. మరోవైపు తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికతో వాతావరణం మరింతగా వేడెక్కింది. తిరుపతి బరిలో జనసేన ఎందుకు నిలవలేదు. వాస్తవానికి బీజేపీతో పోలిస్తే.. జనసేనకే బలం ఎక్కువ. అలాంటప్పుడు జనసేన అభ్యర్థి పోటీ చేయాలి. కానీ.. అందుకు భిన్నంగా బీజేపీ పోటీ చేసేందుకు వీలుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎందుకిలాంటి నిర్ణయాన్ని పవన్ తీసుకున్నారు. జనసేనానికి బీజేపీ ఏం చెప్పింది? తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలన్న ఉత్సాహాన్ని ఎందుకు ప్రదర్శించింది? లాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. తాజాగా.. వాటన్నింటికి సమాధానాల్ని చెప్పేశారు జనసేనాని పవన్ కల్యాణ్. తాజాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేయటానికి తిరుపతి వచ్చిన ఆయన.. బహిరంగ సభలో మాట్లాడారు.

ఇంతకూ తిరుపతి సీటును తాము పోటీ చేయకుండా బీజేపీకి ఎందుకు ఇచ్చేశామన్న విషయాన్ని సూటిగా చెప్పేశారు. ఎవరో ఏదో అడిగితే అన్నట్లు కాకుండా.. సమాధానం చెప్పటం తన బాధ్యత అన్నట్లుగా పవన్ మాటలు ఉండటం గమనార్హం. అధికారం కోసం అర్రులుచాచే వ్యక్తిని కాదు నేను. మీ గుండెల్లో స్థానం సుస్థిరం చేసుకున్నా. మీకు సేవచేసుకునే భాగ్యం వస్తే అందరికంటే ఎక్కువ సేవచేయగలను. వచ్చినా రాకపోయినా మీకోసం కడవరకు సేవచేస్తా. అధికార బదలాయింపు జరగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. నేను ప్రజలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటా. కంపెనీ ప్రొడక్టులకు కాదు ఇది హిందూ దేశం. అన్ని మతాలను కలుపుకొనివెళ్లే దేశం. 1999లో బీజేపీ గెలిచిన సీటు ఇది.

మన తిరుపతి హిందువులకు ప్రత్యేకమైనది. ఇలాంటిచోట జాతీయస్థాయి నాయకత్వం కావాలి' అన్న ఆయన.. అందుకే తాము పోటీ నుంచి దూరంగా ఉన్నామన్న విషయంపై క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి. మరి.. పవన్ మాటలు తిరుపతి ఓటర్లపై ఏంతమేర ప్రభావాన్ని చూపిస్తాయన్నది తేలాలంటే మే 2 వరకు వెయిట్ చేయక తప్పదు.