Begin typing your search above and press return to search.

పవన్ పశ్చాతాపం.. కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చి తప్పు చేశాం

By:  Tupaki Desk   |   19 Jun 2023 9:17 AM GMT
పవన్ పశ్చాతాపం.. కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చి తప్పు చేశాం
X
కాకినాడ లో నిర్వహించిన వారాహి విజయయాత్ర లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనల్ని క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు పవన్ చేసిన ప్రసంగాల్లో ఫైరింగ్ ప్రసంగం ఇదేనన్న మాట వినిపిస్తోంది. దాదాపు గంట ఇర వై నిమిషాల పాటు ప్రసంగించిన పవన్ కల్యాణ్.. వైసీపీ కి చెందిన పలువురు నేతల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. అందరి కంటే ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై నిప్పులు కురిపించిన ఆయన.. పవర్ ఫుల్ శపధాన్ని చేయటం తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి ని ఓడించకుంటే తన పేరు పవన్ కల్యాణ్ కాదని.. తన పార్టీ జనసేన కాదంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయన మరికొందరు వైసీపీ నేతల పేర్లను ప్రస్తావించారు.

అందులో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కురసాల కన్నబాబు కూడా ఉన్నారు. జర్నలిస్టుగా ఈనాడు లో సుదీర్ఘ కాలం పని చేసి.. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు లో చిరంజీవి కి అత్యంత సన్నిహితంగా మెలిగిన కన్నబాబు.. తర్వాత కాకినాడ రూరల్ టికెట్ ను సొంతం చేసుకున్నారు.

ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. ఆ తర్వాత 2014లో మాత్రం వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో కి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రి గా వ్యవహరించారు. చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కన్నబాబు.. పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేసింది తక్కువే. తాజాగా కాకినాడ సభలో ఎమ్మెల్యే కన్నబాబు పేరు ను ప్రస్తావించి.. ఆయన్ను తాము అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చామంటూ పశ్చాతాపానికి గురి కావటం గమనార్హం.

అదే సమయంలో..కన్నబాబు పై పంచ్ వేసే విషయంలో పవన్ వెనక్కి తగ్గలేదు. కాపుల కు అన్యాయం జరుగుతుంటే తోట త్రిమూర్తులు.. కన్నబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. "ఏమైనా మాట్లాడితే కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కన్నబాబు బాధ పడతాడు. మేమే రాజకీయాల్లోకి తీసుకొచ్చాం. మా బ్యాడ్ లక్. తప్పు చేశాం" అంటూ పవన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. దీనికి కన్నబాబు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.