Begin typing your search above and press return to search.

పవన్ సీఎం క్యాండిడేట్... నో డౌట్... ?

By:  Tupaki Desk   |   21 April 2022 9:26 AM GMT
పవన్ సీఎం క్యాండిడేట్... నో డౌట్... ?
X
అవును. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధిగానే 2024 ఎన్నికలను ఫేస్ చేయబోతున్నారు. అది డ్యామ్ ష్యూర్. ఇది జనసైనికుల మాట. మరి అది ఎలా జరుగుతుంది. అన్ని సీట్లకు జనసేన పోటీ చేస్తుందా అంటే అది చూడాలి కానీ మొత్తానికి ఈసారి అయితే సీఎం పోస్ట్ ని వదులుకోవడానికి జనసేనాని రెడీగా లేరు అనే తెలుస్తోంది. దీని మీద ఈ మధ్య ఒక వెబ్ చానల్ లో జరిగిన డిబేట్ లో జనసేన పీఏసీ సభ్యురాలు పాలవలస యశస్వి అయితే ఇదే విషయం కుండబద్ధలు కొట్టారు.

పవన్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు అని ఆమె ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఇదే డిబేట్ లో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత లింగారెడ్డి అయితే అది అసలు కుదిరేదే కాదని చెప్పేశారు. తాము పొత్తులు పెట్టుకున్న పార్టీలను గౌరవిస్తామని, వారికి సముచితమైన ప్రాధాన్యత కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతమాత్రం చేత సీఎం పదవి షేరింగ్ అన్న ప్రశ్న తలెత్తదు అనేశారు

అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అదేంటి అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితులో చాన్స్ వదులుకోరాదని అన్న ఆలోచన ఉందని అంటున్నారు. పవన్ పార్టీ పెట్టి 2024 నాటికి పదేళ్ళు అవుతుంది. ఒక విధంగా కూటమికి కట్టి టీడీపీకి పెద్దన పాత్ర ఇచ్చి ఆ పార్టీ మనిషినే సీఎం చేస్తే అపుడు జనసేన సంగతేంటి అన్నదే ఆ పార్టీలో చర్చగా ఉందని అంటున్నారు.

ఇక 2029 దాకా వేచి చూడాలనుకున్నా మరో మారు వైసీపీ పవర్ కి అపుడు పోటీ పడుతుంది. లేక టీడీపీయే నాటికి మరింత స్ట్రాంగ్ అవుతుంది. దాంతో పొత్తుల పార్టీగా ఎన్నో కొన్ని సీట్లు, పోస్టులు తీసుకుని జనసేన సైడ్ గానే ఉండాల్సి వస్తుంది సరిగ్గా ఈ పాయింట్ మీదనే ఇపుడు జనసేనలో హాట్ హాట్ చర్చ సాగుతోంది అని అంటున్నారు. మరి ఏపీలో చూస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చకుండా చూసే బాధ్యత నాది అని గత నెలలో జరిగిన సభలో పవన్ చెప్పి ఉన్నారు.

అంటే కచ్చితంగా టీడీపీతో పొత్తులు ఉంటాయనే హింట్ ఇచ్చారు. అయితే పెద్దన్న పాత్ర వరకూ మాత్రం టీడీపీకి చాన్స్ ఉండదనే జనసేనలో వినిపిస్తున్న మాట. అంతవరకూ వస్తే పవర్ షేరింగ్ కి కూడా పట్టుబడతారు అని తెలుస్తోంది. మరి దానికి టీడీపీ ఒప్పుకుంటుందా అంటే కచ్చితంగా ఒప్పుకోదు, ఎన్ని పదవులు అయినా ఇస్తారు కానీ సీఎం పోస్ట్ దగ్గర టీడీపీ అధినాయకత్వం రాజీ పడేది ఉండదు.

అలాంటపుడు ఈ పొత్తులు ఎలా కుదురుతాయి అంటే అక్కడే అంతా చంద్రబాబు రాజకీయ చాణక్యాన్ని చూస్తున్నారు. ఆయన ఎవరినైనా దారిలోకి తెచ్చుకోగలరు అని కూడా అంటున్నారు. అయితే ఈసారి అలా జరుగుతుందా. పవన్ మళ్లీ తగ్గి చంద్రబాబు సీఎం కావడానికి చాన్స్ ఇస్తారా చూడాలి. అయితే జనసేన వర్గాలు ఈసారి గట్టి పట్టుదల మీద ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణే సీఎం. ఇందులో రెండవ మాటకు తావు లేదు. నో డౌట్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.