Begin typing your search above and press return to search.

రికార్డు అంటే ఇలా ఉండాలి బాబు!

By:  Tupaki Desk   |   30 April 2018 5:32 AM GMT
రికార్డు అంటే ఇలా ఉండాలి బాబు!
X
అయినోళ్లు ప‌ట్టించుకోన‌ప్పుడు.. ఎవ‌రికి వారు త‌మ‌ను తాము పొగుడుకోవ‌టం మామూలే. చిన్నా.. చిత‌క స్థాయిల్లో ఉన్న వారికి ఇలాంటి ఈతి బాధ‌లు త‌ప్ప‌వు. ఒక సీఎం స్థానంలో ఉన్న వ్య‌క్తిని పొగిడేయ‌టానికి..ఆకాశానికి ఎత్తేయ‌టానికి.. మీద ఈగ వాల‌కుండా చూసుకోవ‌టానికి వ్య‌క్తులు.. వ్య‌వ‌స్థ‌లు బోలెడ‌న్ని ఉంటాయి. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న చందంగా ఏపీ ముఖ్య‌మంత్రి బాబును స‌రిగా పొగిడే వారే క‌నిపించ‌రు.

అందుకే కాబోలు.. ఎవ‌రూ పొగ‌డ‌న‌ప్పుడు త‌న‌ను తాను పొగిడేసుకుంటే ఒక ప‌ని అయిపోతుంద‌న్న‌ట్లుగా ఉంటుంది బాబు వ్య‌వ‌హారం. దేశ రాజ‌కీయాల్లో తానే సీనియ‌ర్ అని.. ప్ర‌ధాని మోడీ సైతం త‌న‌కు జూనియ‌ర్ అని చెప్ప‌ట‌మే కాదు.. త‌న‌దెంత లాంగ్ లెగ‌సీ అన్న విష‌యాన్ని క‌థ‌లు.. క‌థ‌లుగా చెప్పుకోవ‌టం చంద్ర‌బాబులో త‌ర‌చూ క‌నిపిస్తూ ఉంటుంది. మొహ‌మాటాన్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ అంత‌లా పొగిడేసుకున్నా.. ఆయ‌న తీరును గొప్ప‌గా చెప్పుకోవాల‌ని అస్స‌లు అనిపించ‌దు. తాజాగా ఒక వైనాన్ని చూసిన‌ప్పుడు గొప్ప‌లు చెప్పుకోవ‌టం కాదు.. గొప్ప ప‌ని జ‌రిగిన‌ప్పుడు దానికి ద‌క్కాల్సినంత పేరు ప్ర‌ఖ్యాతులు ద‌క్కేస్తుంటాయి.

పేరు కోసం.. పొగిడించుకోవ‌టం కోస‌మే ప‌ని చేయ‌కుండా.. త‌న ప‌ని తాను అన్న‌ట్లు చేసుకుంటూ పోతే చాలు.. రావాల్సిన పేరు ప్ర‌ఖ్యాతులు ప‌లక‌రించి మ‌రీ సొంత‌మ‌వుతాయి. ఈ రోజుదిన‌ప‌త్రిక‌ల్ని చూస్తే.. ఒక వార్త అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తుంది. సిక్కిం సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌వ‌న్ చామ్లింగ్ చ‌రిత్ర సృష్టించిన వైనం భారీ స్థాయిలో అచ్చేశారు. ఒక ఈశాన్య రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రి గురించి గొప్ప‌గా రాయ‌టం.. వార్త‌గా ఇవ్వ‌టం చాలా అరుదుగా జ‌రిగే ప‌ని. అయిన‌ప్ప‌టికీ.. అంతేసి ప్ర‌యారిటీ ఇచ్చారంటే ఆయ‌న సాధించిన ఘ‌న‌త ఆ పాటిది కావ‌ట‌మే. ఇంత‌కీ ఆయ‌న సాధించిన ఘ‌న‌త ఏమిట‌న్న‌ది చూస్తే.. అత్యంత సుదీర్ఘ‌కాలం ఒక రాష్ట్రాన్ని పాలించిన నేత‌గా సిక్కిం సీఎం తాజాగా చ‌రిత్ర సృష్టించారు. దేశంలోనే ఈ రికార్డును సొంతం చేసుకున్న ఘ‌న‌త ఛామ్లింగ్‌ కు ద‌క్కింది.

క‌మ్యూనిస్ట్ కురువృద్ధుడు జ్యోతిబ‌సు పేరుతో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రికార్డును సిక్కిం సీఎం త‌న సొంతం చేసుకున్నారు. సిక్కిం ముఖ్య‌మంత్రిగా చామ్లింగ్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఆదివారం నాటికి 23 ఏళ్ల నాలుగు నెల‌ల 17 రోఉలు అవుతుంది. ఇది జ్యోతిబ‌సు రికార్డుకు ఒక రోజు ఎక్కువ‌. ఆ మాట‌కు వ‌స్తే.. ఆయ‌న ప‌ద‌విలో మ‌రికొంత‌కాలం కొన‌సాగ‌నున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ రికార్డును అందుకోసం ఏ అధినేత‌కు అంత సులువైన ప‌ని కాదు. అందుకే.. అక్క‌డెక్క‌డో సిక్కిం సీఎం గురించి గొప్ప‌గా దేశంలోని అన్ని వార్తా సంస్థ‌లు ప్ర‌త్యేక క‌థ‌నాలు వెలువ‌రించాయి. రికార్డు అంటే.. సీనియార్టీ అంటే ఈస్థాయిలో ఉండాలే త‌ప్పించి.. చిల్ల‌ర చిల్ల‌ర‌గా ఉండ‌కూడ‌ద‌న్న వైనాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ్ర‌హిస్తే బాగుంటుంది.

చామ్లింగ్ విష‌యానికి వ‌స్తే.. 1973లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1993లో సిక్కిం డెమొక్ర‌టిక్ ఫ్రంట్ పేరుతో ప్ర‌త్యేక పార్టీ ఏర్పాటు చేసిన ఆయ‌న‌.. ఏడాది కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1994 డిసెంబ‌రు 12న తొలిసారి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న‌.. జ్యోతిబ‌సు రికార్డును తాజాగా బ్రేక్ చేశారు. చామ్లింగ్ త‌ర్వాత సుదీర్ఘ కాలం సీఎంగా ప‌ని చేసిన రికార్డు జాబితాలో జ్యోతిబ‌సు సెకండ్ ప్లేస్ (23ఏళ్ల 137 రోజులు).. మాణిక్ స‌ర్కార్ (20 ఏళ్ల 90రోజులు).. గెగాంగ్ అపాంగ్ (22 ఏళ్ల 256 రోజులు).. క‌రుణానిధి (18ఏళ్ల 293 రోజులు) ఉన్నారు. ఈ లెక్క‌న బాబు సీనియార్టీ ఏ పాటిదో మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది.