Begin typing your search above and press return to search.

తూర్పు కాపుల పేరుతో పవన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 Jun 2023 6:04 PM GMT
తూర్పు కాపుల పేరుతో పవన్ సంచలన వ్యాఖ్యలు
X
వారాహి విజయయాత్రలో భాగంగా సభలు.. సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన మార్కుగా చెప్పే కుల వ్యాఖ్యలు చేవారు. భీమవరంలో బీసీ నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన.. 450 మంది తూర్పు కాపు.. వివిధ బీసీ కులాలకు చెందిన నాయకులు.. కార్యకర్తలు పార్టీలో చేరనున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి పదవిపై పవన్ చేసే వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశంగా మారతాయి. తాజాగా అలాంటి వ్యాఖ్యలే మళ్లీ చేయటం గమనార్హం.

సమాజంలోని కులతత్త్వం పోవాలని చెబుతూనే.. మరోవైపు కులాలకు సంబంధించిన వ్యాఖ్యల్ని ప్రముఖంగాచేస్తున్న పవన్ కల్యాణ్.. తాజాగా తాను చేసిన ప్రసంగంలో తూర్పు కాపులతో పాటు మరికొన్ని వర్గాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. తూర్పు కాపుల సంక్షేమానికి.. సమస్యల పరిష్కారానికి భీమవరంలో బీజం పడిందన్నా ఆయన.. తూర్పుకాపుల సంఖ్యను వివిధ రాజకీయ పార్టీలు చెబుతున్న లెక్కలను తప్పుపట్టారు.

ఏపీలో తూర్పు కాపులు 26 లక్షల మంది ఉన్నారని టీడీపీ చెబుతుంటే.. వైసీపీ ప్రభుత్వం 16 లక్షలుగా చెబుతుందని.. కానీ 45 లక్షల మంది తూర్పుకాపులు రాష్ట్రంలో ఉన్నట్లుగా పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ చెబుతున్న 16 లక్షల లెక్కకు ఏది ప్రాతిపదిక? పథకాలు అందకుండా చేయటానికి వైసీపీ ప్రభుత్వం అలా చెబుతోందన్న ఆయన.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తూర్పు కాపుల గణన చేపడతామన్నారు. అందరికి న్యాయం జరిగితే.. కులాలతో సంబంధం లేదన్న ఆయన.. చట్టం పని చేయనప్పుడు కులాల వైపు చూస్తామన్నారు.

తూర్పు కాపుల్లో మంత్రులు ఉన్నారని.. ఎమ్మెల్యేలు ఉన్నారని. .వారు తిన్న తర్వాతైనా కులం గురించి ఆలోచించాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఇతర బీసీ కులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. తూర్పు కాపులకు ఎందుకు ఇవ్వరు? ఇవ్వకపోవటానికి హేతుబద్ధత ఏమిటి?'' అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని బీసీ జాబితాలో ఉన్న తూర్పు కాపులను తొలగించారని వ్యాఖ్యానించారు.

తెలంగాణలోని బీసీ జాబితాలో ఉన్న తూర్పు కాపులను తొలగించినా.. అక్కడి నేతలు పట్టించుకోలేదన్న పవన్ కల్యాణ్.. బీసీ కులాల జనగణనకు తాను అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలన్న ఆయన.. ఒక్క ఎమ్మెల్యే పని చేయడన్నారు. ప్రశ్నిస్తే బూతులు తిడతారని.. దేశంలో కులం బలంగా మారటానికి వ్యవస్థలు సరిగా పని చేయకపోవటమే అన్న పవన్.. తాను ముఖ్యమంత్రి కావటంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి పదవిని చేపట్టే విషయం మొదలు.. సీఎం పదవి చేతికి వస్తే ఏమేం చేస్తానో తరచూ చెప్పే పవన్..ఈసారి మరింత కన్ఫ్యూజన్ కు గురి చేసేలా వ్యాఖ్యలు చేయటం విశేషం. 'సీఎం కావటం అన్నింటికీ మంత్రదండం కాదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయాలనుకున్నా.. అధికారులో.. నాయకులో అడ్డు పడతారు. చైతన్యవంతమైన సమాజంతో అన్ని సమస్యలకు పరిష్కారం. నేను ముఖ్యమంత్రి అయినా నన్ను నిలదీసే స్థితికి ప్రజలు రావాలి' అంటూ వ్యాఖ్యానించారు.