Begin typing your search above and press return to search.

రంగా ఉదంతాన్ని చెప్పి.. పవన్ సంధించిన సూటి ప్రశ్న

By:  Tupaki Desk   |   30 Sept 2021 12:04 PM IST
రంగా ఉదంతాన్ని చెప్పి.. పవన్ సంధించిన సూటి ప్రశ్న
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేతల సభలకు వచ్చే వేలాది మంది.. అదే నేతకు అవసరమైనప్పుడు సాయంగా ఉండేందుకు ముందుకు రారా? ఎందుకలా జరుగుతుంది? లాంటి ప్రాధమికమైన ప్రశ్నతో పాటు..తన జీవితంలో తానుచూసి.. తాను అనుభవించిన ఉదంతాన్ని చెప్పిన వైనం ఆసక్తికరంగా మారింది. వైసీపీ వర్సెస్ పవన్ మధ్య సాగుతున్న మాటల రచ్చ వేళ.. పవన్ అభిమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారంటూ పోసాని ఆరోపిస్తూ.. బండ బూతులు తిట్టేయటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. జనసైనికులతో కలిసి ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన వంగవీటి రంగా అంశం ఆసక్తికరంగానే కాదు.. ఒక ప్రాథమిక మైన ప్రశ్నను తెర మీదకు తీసుకొచ్చేలా ఉండటం గమనార్హం.

ఇంతకీ రంగా గురించి పవన్ ఏమన్నారు? ఏం చెప్పారు? ఆయన సంధించిన సూటి ప్రశ్న ఏమిటి? అన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

‘‘వంగవీటి రంగా బతికి ఉన్న రోజుల్లోనెల్లూరు.. చెన్నైలో ఉండేవాడిని. నేను నేరుగా ఆయన్ను కలవలేదు కానీ చూశాను. ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు.. ఆయన స్నేహితులైన కమ్మవారు. అన్నయ్య ప్రొడ్యుసర్లు ఉన్నారు. వారికి కాఫీలు పంపించానంతే. అలాగే నా కజిన్ మెహర్ రమేశ్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి గుడ్ల వల్లేరులో చదువుకునే వాడు. ఒకసారి వచ్చేశాడు. సెలవులు కాదుకదా ఎందుకు వచ్చావు? అని అడిగితే.. కులాల గొడవలు జరుగుతున్నాయి.. పాలిటెక్నిక్ కాలేజీ మూసేస్తే వచ్చానని చెప్పాడు’’

‘‘నాకు అప్పటి నుంచి ఈ గొడవలేంటి? ఎందుకు ఉంటాయి? అనేది అర్థం కాలేదు. నేను నెల్లూరులో పెరిగాను.

నెల్లూరులో ఎప్పుడు ఇంత గొడవలు చూడలేదు. ఆ తర్వాత నేను అధ్యయనం చేయటం మొదలుపెట్టాను. రంగా చనిపోయినప్పుడు నెల రోజులు తగలబడిపోతున్నది చూశాను. అవన్నీచూసి.. ఎందుకిలా అయిపోయిందని అనుకున్నా. .తర్వాత తర్వాత అర్థం చేసుకున్న కొద్దీ.. అందరికి అర్థమైందే నాకు అర్థమైంది’’

‘‘నాకు వచ్చిన మౌలికమైన ప్రశ్న ఏమంటే.. రంగా సభలు పెడుతున్నప్పుడు క్రిష్ణా నది తీరమంతా నిండిపోయేదని. మరి.. అలాంటి రంగా.. అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి నాకు ప్రాణ భయం ఉందని ఆయన సత్యాగ్రహం చేస్తుంటే.. నాకు వచ్చిన సందేహం ఏమంటే.. క్రిష్ణా నది తీరమంతా నిండిపోయేంత జనం వచ్చారు కదా? వీరిలో రోజుకు వంద మంది ఆయన పక్కన ఎందుకు కూర్చోలేకపోయారు? అనిపించింది. ఏమై పోయారు వీరు? ఒక సభకు వచ్చారు..అలాంటి వారు ఆయన పక్కన కూర్చొని ఎందుకు రక్షించుకోలేకపోయారు? అన్నది ఈ రోజుకు నన్నుపట్టి పీడించే ప్రశ్న. ఎదుటివారిని అనే ముందు మనం ఏం చేశామన్నది కూడా ఆలోచించుకోవాలి. ఇది చాలా అవసరం. గుడ్డి ద్వేషం సమాజాన్నినిట్టనిలువునా చీల్చేసి ఎవరికి సంతోషం లేకుండా చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.