Begin typing your search above and press return to search.

పవన్ ముందున్న ఆప్షన్...ఏపీలో సంచలనమే...!

By:  Tupaki Desk   |   21 March 2023 5:20 PM GMT
పవన్ ముందున్న ఆప్షన్...ఏపీలో సంచలనమే...!
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఏడాది పలుమార్లు మంగళగిరిలోని తన పార్టీ ఆఫీసుకు వచ్చినపుడు క్యాడర్ తో మాట్లాడుతూ చేసిన ప్రసంగాలు ఇచ్చిన సంకేతాలు ఇపుడు మరో మారు చర్చకు వస్తున్నాయి. ఏపీలో ఇపుడు రాజకీయ సన్నివేశం బాగా మారింది. ఇప్పటిదాక ఏపీలో బలమైన పార్టీగా వైసీపీ ఉంది. విపక్షాలకు ఒంటరిగా ఢీ కొట్టేందుకు బలం సరిపోదు అని అంటూ వచ్చారు. అయితే మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుని తెలుగుదేశం వైసీపీని గుక్క తిప్పుకోనేయకుండా చేసింది.

అందునా వైసీపీకి హార్డ్ కోర్ సబ్ రీజియన్ అయిన రాయలసీమలోనే గట్టి ఝలక్ ఇచ్చేసింది. ఈ పరిణామం ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది అని చెప్పాలి. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ధీటుగా టీడీపీని జనాలు ఎంచుకుంటారు అన్న మేసేజ్ అయితే జనంలోకి సక్సెస్ ఫుల్ గా వెళ్లిపోయేలా చేయడంలో నాలుగేళ్ళ పాటు పరిశ్రమించి చంద్రబాబు రచించిన వ్యూహాలు ఫలించాయి అని చెప్పాలి.

ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇది విపక్షాలకు అన్నింటికీ తెలిసిన విషయమే కాబట్టి పెద్దగా ఎవరూ ఫికర్ అయిన సీన్ అయితే లేదు. కానీ జనసేన తీరు అలా కాదు, వచ్చే ఎన్నికల్లో తాము మూడవ ఫోర్స్ గా ఎదగాలని చూస్తోంది. పొత్తులతో భాగంగా అధికార వాటా కోరుకుంటోంది.

అలా రాయబేరాలు ఒక దశలో ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికల రూపేణా టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పొత్తుల విషయంలో ఏమి చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. మంగళగిరి మీటింగులలో పవన్ మూడు ఆప్షన్లు తనకు ఉన్నాయని చెప్పుకున్నారు. అందులో మొదటికి టీడీపీ బీజేపీ జనసేన కలసి పోటీ చేయడం. ఆ ఆప్షన్ అన్నది కుదరదు అన్నది ఇప్పటికే తేలిపోయింది. రెండవది జనసేన టీడీపీ పోటీ చేయడం, ఈ ఆప్షన్ అలాగే ఉంది. మూడవది ఒంటరిగా జనసేన పోటీ చేయడం. ఈ విషయంలో సైతం పవన్ మనోభావాలు ఏంటో చెప్పేశారు అని అంటున్నారు.

ఎచ్చెరలో జరిగిన యువత సభలో పవన్ ఒంటరిగా పోటీ చేయాలంటే గెలుపుపైన నమ్మకం ఉండాలని, అలా ఓటేసి గెలిపిస్తామని నమ్మకం ఉంటేనే దిగుతామని చెప్పారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో సైతం ఆయన సర్వేలలో తమ పార్టీ గెలుపు గురించి ఏమైనా ఆశావహమైన సమాచారం ఉంటే ఒంటరి పోరుకు వెనకాడబోమని చెప్పారు. అయితే పవన్ ఒంటరిగా పోటీ చేయడం కంటే పొత్తుల వైపే చూస్తున్నారు అని అంటున్నారు.

ఈసారి ఎన్నికలు అంగబలం, అర్ధబలంతో కూడుకున్నవి. అటు చంద్రబాబు, ఇతు జగన్ కూడా ధీటుగా సరిసాటిగా అన్నింటా ఉంటారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎంతవరకూ నెగ్గుకువస్తారన్న చర్చ కూడా ఉంది. దాంతో తెలుగుదేశంతో పొత్తులు అన్న ఒక ఆప్షన్ అలా ఉండనే ఉందని అంటున్నారు. పవన్ జనసేన టీడీపీతో పొత్తులకు వెళ్లాలీ అంటే గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని కండిషన్ అయితే పెట్టారు.

మరి ఇపుడు సీన్ చూస్తే తెలుగుదేశం ఆ విధంగా చేస్తుందా అంటే కష్టమనే అంటున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ 150 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని భావిస్తోంది. అదే విధంగా పొత్తులకు ఆ మిగిలిన పాతిక సీట్లు వదిలేయాలన్నదే టీడీపీ ఆలోచన. అందులోనే కామ్రేడ్స్ కానీ బీజేపీ కానీ జనసేన కానీ సర్దుకోవాల్సి ఉంటుంది. మరి యాభై సీట్ల దాకా తమకు ఇస్తేనే పొత్తులు అని జనసేన అంటే అసలు కుదిరే వ్యవహారమేనా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం.

అయితే వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని జనసేన కూడా ఒక మెట్టు దిగే అవకాశాలు ఉన్నాయా అన్నదే అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక పొత్తులతో పోటీ చేసి అసెంబ్లీలో తమ సత్తాను చాటడం జనసేనకు ఉన్న ఆప్షన్. అది కాదు అనుకుంటే ఒంటరిగానే బరిలోకి దిగి సత్తా తేల్చుకోవాలి. అపుడు ట్రయాంగిల్ ఫైటింగ్ లో ఎలా ఉంటుందో తెలియదు. ఏది ఏమైనా పొత్తుల వైపీ జనసేన మొగ్గు చూపవచ్చు అని అంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత పవన్ నుంచి వస్తున్న ప్రకటనలు అన్నీ కూడా టీడీపీకి అనుకూలంగానే ఉండడాన్ని ఉదహరిస్తున్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల మీద దాడిని జన సేనాని గట్టిగా ఖండించారు. జీవో నంబర్ 1 మీద తెలుగుదేశం సభ్యులు కోరిన విధంగా ఎందుకు చర్చ జరపరూ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిని బట్టి చూస్తూంటే పవన్ ఆ ఆప్షన్ నే ఎంచుకున్నారని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లలో జనసేన టీడీపీ పొత్తులలో వెళ్తే మాత్రం ఏపీలో అది పెను రాజకీయ సంచలనమే అవుతుంది అంటున్నారు. వైసీపీకి కూడా చుక్కలు కనిపిస్తాయని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.