Begin typing your search above and press return to search.

దమ్ముంటే నా మీద మీ ప్రతాపం చూపించండి వైసీపీకి పవన్ సవాల్

By:  Tupaki Desk   |   4 April 2021 6:30 AM GMT
దమ్ముంటే నా మీద మీ ప్రతాపం చూపించండి వైసీపీకి పవన్ సవాల్
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెలరేగిపోయారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ తరఫున ఎన్నికల ప్రచారానికి తిరుపతికి వచ్చిన పవన్.. బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీదా.. వైసీపీ నేతల తీరుపైనా మండిపడ్డారు. జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందను దారుణంగా హత్య చేసి రెండేళ్లు అయినా.. దోషుల్ని ఎవరో గుర్తించి పట్టుకోకపోవటాన్ని తప్పు పట్టారు.

దోషులు ఎవరో తెలిసినా పట్టుకోవటం లేదని స్వయంగా వైఎస్ వివేకా కుమార్తె సునీత ఢిల్లీలో మాట్లాడటాన్ని ప్రస్తావించిన పవన్.. 'సొంత చిన్నాన్న చనిపోయినా దిక్కు లేకుండా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఆయన్ను చంపిన నేరస్తుల్ని కాపాడే వ్యక్తులు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు సామాన్యులకు ఏం న్యాయం కలుగుతుంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. వైసీపీ ఎమ్మెల్యేల గుండాగిరి ఎక్కువైంది'' అని మండిపడ్డారు.

2018లో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పైన కోడికత్తితో హత్యాయత్నం జరిగిందని.. డీజీపీ.. సీఐడీ అధికారులంతా మీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నా దోషుల్ని ఎందుకు గుర్తించలేకపోయారు? అంటూ సూటి ప్రశ్నను సంధించారు. రాష్ట్రంలో రోడ్డు మీద వెళ్లే వారిపైనా ఎస్సీ.. ఎస్టీ కేసులు పెడుతున్నారని.. రేషన్ కార్డులు ఇవ్వమంటున్నారన్నారు. షాపులు మూయిస్తున్నారంటూ తప్పు పట్టారు.

సామాన్యలు మీద ప్రతాపం చేపించే కన్నా.. దమ్ముంటే తనపైన చూపించాలని.. తాను దేనికైనా సిద్ధమని జనసేన అధినేత స్పష్టం చేశారు. ఓటుకు రూ.2వేలు చొప్పున వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని.. అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఇటీవలే మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టిందని.. ఎవడబ్బ సొమ్మని సంక్షేమం పేరుతో పంచి పెడుతున్నారని.. తాను సినిమాలు చేస్తుంటే తప్పు పట్టిన వారికి పవన్ ఘాటు రిప్లై ఇచ్చారు.

''సినిమాల్లోకి వెళ్లానంటూ నన్ను విమర్శిస్తున్న వారిలా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్బులు లేవు. రాజకీయ నాయకులకు డబ్బులు ఎలా వస్తాయి? వైసీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సినిమాలు మానేసి అడ్డదారులు తొక్కను. అన్యాయమైన సంపద మాకొద్దు. పిడికెడు రాగి సంగటి తింటా కానీ... అడ్డదారులు తొక్కను'' అని స్పష్టం చేశారు.

సీఎం కావాలని తాను ఎప్పుడూ ఆలోచించలేదని.. ప్రజల గుండెల్లో ఉన్న పదవి చాలన్నారు. అధికారంలోకి రాకున్నా ప్రజాసేవలో పాలుపంచుకుంటానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిందని.. జాతీయనాయకత్వం మారాలని.. ఏడేళ్ల క్రితం ఇదే తిరుపతి నుంచి సంకల్పించామని.. వచ్చే ఏడాదికి ఏపీ దిశ మారాలని అందరం కోరుకుందాం. 40 ఏళ్ల సివిల్ సర్వీసులో ఉన్న విశిష్టమైన వ్యక్తి రత్నప్రభ. మానవహక్కుల కోసం పని చేశారు. ఏపీ ఐటీ హబ్‌గా ఉందంటే... రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభేనని చెప్పారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిస్తే.. ఏం చేయగలరని ప్రశ్నించారు. ఒకవేళ విజయం సాధించినా.. ఆయనేం మాట్లాడలేరన్నారు. ఎందుకంటే.. పార్టీ కంట్రోల్ లో ఉంటారన్నారు. అదే.. రత్న ప్రభ గెలిస్తే.. ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకునే వీలుందన్నారు. ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీల ఉండి ఏమీ చేయలేకపోయారన్నారు. జగన్ పాలనతో బెదిరింపులు తప్పించి.. మరింకేమీ లేదన్న పవన్.. దమ్ముంటే తనపై గొడవకు రావాలని.. అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ గా మాట్లాడిన పవన్ స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.