Begin typing your search above and press return to search.

అరగంటలో నా భర్త ఆచూకీ చెప్పాలి.. లేకపోతే అంతే అంటున్న పట్టాభి సతీమణి

By:  Tupaki Desk   |   21 Feb 2023 12:02 PM GMT
అరగంటలో నా భర్త ఆచూకీ చెప్పాలి.. లేకపోతే అంతే అంటున్న పట్టాభి సతీమణి
X
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు పెద్ద ఎత్తున దాడి చేయటం.. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటంతోపాటు.. కనిపించిన వారిని కనిపించినట్లుగా గాయపర్చటం తెలిసిందే. కత్తులు.. కర్రలు.. రాడ్లతో స్వైర విహారం చేసిన ఈ తీరుపై మండిపడిన టీడీపీ నేతలు.. ఘటనాస్థలానికి చేరుకోవటం.. ఆ సందర్భంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు తమతో తీసుకెళ్లిన వైనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆయన ఆచూకీ గురించి పోలీసులు పెదవి విప్పటం లేదు. మరోవైపు ఆయన ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. దీంతో.. పట్టాభికి ఏం జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీడీపీ నేతలు.. పట్టాభి కేటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే తన భర్త ఆచూకీ తెలియజేయాలంటూ పట్టాభి సతీమణి పోలీసు ఉన్నతాధికారుల్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పట్టాభి కనిపించకుండా పోయి దాదాపు పన్నెండు గంటలు దాటిపోవటం.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పట్టాభి సతీమణి చందన మరోసారి తన ఆందోళనను మీడియా ముందు వెల్లడించారు.

తన భర్త ఆచూకీ రాత్రి నుంచి తేలకపోవటంపై తన కుమార్తె తీవ్రంగా టెన్షన్ పడుతోందని పేర్కొన్నారు. 'పట్టాభిని ఎవరు తీసుకెళ్లారో తెలీదు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అరగంటలో నా భర్త పట్టాభి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలి. లేదంటే నేను డీజీపీ ఇంటి ముందు నిరాహార దీక్షచేస్తా. నా కూతురు భయపడుతుంది' అని ఆమె పేర్కొన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ కు తమ వాళ్లను పంపుతున్నా.. పట్టాభి ఆచూకీ గురించి ఏ ఒక్కరు మాట్లాడటం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. గన్నవరం ఉదంతంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా.. కొమ్మారెడ్డి పట్టాభి భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ మూక తమ పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే వారిని వదిలేసి.. నిరసన చేపట్టేందుకు వచ్చిన తమ పార్టీ నేతల్ని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. పట్టాభి ఆచూకీ పై ఎవరూ మాట్లాడకపోవటంపై ఇప్పుడు టీడీపీలో టెన్షన్ నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.