Begin typing your search above and press return to search.

తెలంగాణలో తొలి ట్రాన్స్ జెండర్ల వైద్యం.. పేషంట్లు ఏమంటున్నారంటే.!

By:  Tupaki Desk   |   21 Dec 2022 11:30 PM GMT
తెలంగాణలో తొలి ట్రాన్స్ జెండర్ల వైద్యం.. పేషంట్లు ఏమంటున్నారంటే.!
X
తెలంగాణలోని ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ప్రభుత్వ వైద్యులుగా నియామకం అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రాచీ(29).. ఖమ్మం జిల్లాకు చెందిన రూథ్(28) అనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లు కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఈ సందర్భంలో ఉస్మానియాలో మెడికల్ ఆఫీసర్లుగా చేరి అందరి దృష్టినీ ఒక్కసారిగా ఆకర్షించారు.

ఎంబీబీఎస్ పూర్తి చేశారు కానీ స్థిరంగా ఒకచోట ఉండి వైద్యం చేయడానికి ఎండీ.. ఎంఎస్ చదవడానికి మాత్రం వారికి జెండర్ అడ్డంకిగా మారింది. నీట్ పరీక్షలో థర్డ్ జెండర్ కాలమ్ ఉన్నప్పటికీ.. తెలంగాణ కౌన్సెలింగ్‌లో మాత్రం ఆ కాలమ్ లేకపోవడం వారికి ఇబ్బందిగా మారింది. నీట్‌లో మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ థర్డ్ జెండర్ కింద కౌన్సెలింగ్ చేయబోమని అధికారులు చెప్పారు.

అయితే తమ ఐడెంటిటీని దాచుకుని అడ్మిషన్ తీసుకోవడం వీరిద్దరి ఇష్టం లేదని ట్రాన్స్ జెండర్లు చెబుతున్నారు. ఈక్రమంలోనే దీనిపై పోరాడుతున్నామని రూథ్ వెల్లడించారు. కాగా చదువుకునే సమయంలోనూ తమ జెండర్ కారణంగా అనేక ఇబ్బందులు పడినట్లు వాపోయారు. జెండర్ విషయంలో సమాజంలో ఇంకా మార్పు రావాల్సి ఉందని వారు గుర్తు చేశారు.

తనకు ఐదేళ్ల వయస్సు నుంచి శరీరంలో వస్తున్న మార్పులు గుర్తించినట్లు ప్రాచీ తెలిపారు. అయితే సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష కారణంగా కొన్నేళ్ల తమ ఐడెంటీని దాచుకున్నామని తెలిపారు. కాగా తాను తొలిసారి ఫ్రెషర్ పార్టీ సమయంలో చీర కట్టుకొని వెళ్లినట్లు ప్రాచీ వెల్లడించారు.

అప్పుడే తనను తాను ట్రాన్స్ జెండర్ గా ప్రకటించుకున్నట్లు తెలిపారు. తాను ఆదిలాబాద్ రిమ్స్ ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు చెప్పారు. అలాగే రూథ్ సైతం ఏడేళ్ల నుంచి శరీరంలో మార్పులు గుర్తించానని తెలిపారు. అబ్బాయిలతో కంటే అమ్మాయిలతో ఉండేందుకు ఎక్కువ ఇష్టపడే దాన్ని అని చెప్పారు.

ఆడ పిల్లల బట్టలు వేసుకోవడం.. అలంకరించుకోవడం ఇష్టం ఉండేదని తెలిపారు. అయితే సమాజంలో వివక్ష కారణంగా ముందు చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎంబీబీఎస్ తర్వాత 2017లో తాను టాన్స్ అనే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు రూథ్ వెల్లడించారు. అప్పటి నుంచి అందరికీ అలానే చెబుతున్నట్లు రూథ్ తెలిపారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు తమకు వివక్ష ఎదురైనట్లు వారు చెప్పారు. ఒకనొక దశలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు వాపోయారు. కాగా వీరిద్దరూ గతంలో ఒక స్వచ్ఛంద సంస్థ ట్రాన్స్ వ్యక్తుల కోసం నడిపే క్లినిక్‌లో సేవలందిచారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో.. ఉస్మానియా ఆసుపత్రి క్యాంపస్‌లో వైరల్ వ్యాధుల క్లినిక్ లో పని చేశారు.

ఈ సమయంలోనే మెడికల్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ పడినప్పుడు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. తమకు ఇంటర్వ్యూ చేసి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్లుగా నియమించారని చెప్పారు. నవంబర్ 24 నుంచి ఇక్కడే వైద్యం చేస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలోనే డాక్టర్లుగా రోగులకు సేవలందిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాలను వెల్లడించారు.

మొదట్లో తమతో వైద్యం చేయించుకునేందుకు రోగులకు కొంత ఇబ్బందులకు గురయ్యే వారని తెలిపారు. అయితే తాము అందించిన వైద్యంతో కోలుకున్నాక వారంతా తమను దేవుళ్లలాగా చూసేవారని గుర్తు చేసుకున్నారు. చాలా మంది మమ్మల్ని అభినందిస్తుంటారని.. మీరు మాకు స్ఫూర్తి అంటూ ప్రశంసిస్తారని చెప్పారు. అయినప్పటికీ సమాజంలో ఇంకా ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష పోవాల్సిన ఆవశ్యకత ఉందని యువ ట్రాన్స్ జెండర్లు తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.