Begin typing your search above and press return to search.

ఈ ఆస్ప‌త్రిని చూసి సిగ్గుప‌డ‌కుండా ఉండగ‌లారా?

By:  Tupaki Desk   |   23 Sep 2016 6:49 PM GMT
ఈ ఆస్ప‌త్రిని చూసి సిగ్గుప‌డ‌కుండా ఉండగ‌లారా?
X
నేను రాను బిడ్డో స‌ర్కారు ద‌వాఖన‌కు అనే పాట చాలాకాలం కింద‌ పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. పాట ఎప్ప‌టిదో అయినా ప‌రిస్థితుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా రాన్రాను ఘోరంగా మారుతున్నాయ‌నేందుకు తాజా ప‌రిస్థితులే ఉదాహ‌ర‌ణ‌. ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో నేల మీద అన్నం పెట్టి అక్క‌డే తినాల్సిందిగా పేషెంట్‌ను ఆదేశించారు. అంతేకాదు అది త‌మ ఆస్ప‌త్రిలో కామ‌న్ అని కూడా తేల్చేశారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని అతిపెద్ద వైద్య విభాగ‌మైన రాంచీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఈ అత్యంత ద‌య‌నీయ సంఘ‌ట‌న జ‌రిగింది. అక్క‌డి వైద్యం చేయించుకునేందుకు ప‌ల్మాటి దేవి అనే మ‌హిళ ఆస్ప‌త్రికి వ‌చ్చింది. ఎముకలు విరిగి లేవలేని స్థితిలో ఉన్న ఈ అభాగ్యురాలు భోజనం టైం స‌మ‌యంలో త‌న వంతు కోసం ఆశ‌ప‌డింది. అయితే ఆ స‌మ‌యంలో ఆస్ప‌త్రి వారి ద‌గ్గ‌ర ప్లేట్లు లేవు. దీంతో ఆస్ప‌త్రి వ‌రండా నేల‌పైనే ఆమెకు అన్నం పెట్టారు. అప్ప‌టికే ఆక‌లితో న‌క‌న‌క‌లాడుతుడున్న ఆ పేషెంట్ చేతికి బ్యాండేజీ క‌ట్ల‌తో అన్నాన్ని అదే విధంగా తినేసింది. ఈ హృద‌య‌విదార‌క చిత్రాన్ని దైనిక్ భాస్క‌ర్ ప‌త్రిక జ‌ర్న‌లిస్టు వెలుగులోకి తెచ్చారు.

ఇదిలాఉండ‌గా దేవికా రాణి అనే పేషెంట్ స్థితిగ‌తుల‌పై ఆస్ప‌త్రివ‌ర్గాలు షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఇంత అమాన‌వీయంగా ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని సంబంధిత ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్‌ను ప్ర‌శ్నించ‌గా త‌మ ద‌వాఖ‌న‌లో ఇలా నేల మీదే భోజ‌నం పెట్ట‌డం కామ‌న్ అంటూ తేల్చేశారు. అయితే మీడియా ప్ర‌శ్నిస్తుంద‌ని భ‌య‌ప‌డ్డాడో ఏమో తెలియ‌దు కానీ....ఇలా చేసిన వారిపై చ‌ర్య తీసుకుంటాను అని ఓ హామీ ఇచ్చేశారు. ఇంత‌కంటే షాక్ అయ్యే విష‌యం ఏంటంటే.. ఈ ఆస్ప‌త్రి అభివృద్ధి కోసం ఏటా రూ.300 కోట్ల‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయిస్తోంది. ఆ సొమ్ములు అంతా దిగ‌మింగుతూ ఇంత అన్యాయంగా ప్ర‌వ‌ర్తిస్తున్న వారిని ఏమ‌నాలో మీరే చెప్పండి.