Begin typing your search above and press return to search.

వీళ్ల‌ది ప‌సుపు కుంకుమ‌!..వాళ్ల‌ది మంగ‌ళ‌సూత్ర‌!

By:  Tupaki Desk   |   29 March 2019 2:32 PM GMT
వీళ్ల‌ది ప‌సుపు కుంకుమ‌!..వాళ్ల‌ది మంగ‌ళ‌సూత్ర‌!
X
ప్ర‌స్తుత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పెరిగిన మ‌హిళా ఓట‌ర్లే కీల‌క భూమిక పోషించ‌నున్నారు. పురుష ఓట‌ర్ల‌కు స‌రిస‌మానంగా కొన్ని ప్రాంతాల్లో - పురుష ఓట‌ర్ల కంటే ఎక్కువ సంఖ్య‌లో మ‌హిళా ఓట‌ర్లు న‌మోద‌య్యారు. దీంతో ఇప్పుడు పురుష ఓట‌ర్ల కంటే కూడా మ‌హిళా ఓట‌ర్ల పైనే అన్ని పార్టీలు దృష్టి కేంద్రీక‌రించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాకుండా మ‌హిళ‌లు మాటిస్తే... పురుషుల్లా అప్ప‌టిక‌ప్పుడు మాట మార్చుకోరు. ఇది కూడా అన్ని రాజ‌కీయ పార్టీల‌కు మ‌హిళా ఓట‌ర్లే టార్గెట్ గా మార‌డానికి కార‌ణ‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు అటు జాతీయ పార్టీల‌తో పాటు ఇటు ప్రాంతీయ పార్టీలు కూడా త‌మ‌దైన వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నాయన్న వాద‌న వినిపిస్తోంది.

ఈ విష‌యంలో అన్ని పార్టీల కంటే కూడా కాస్తంత ముందుగానే మేల్కొన్న ఏపీలో అధికార పార్టీ టీడీపీ... ప‌సుపు కుంకుమ పేరిట ఓ స‌రికొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టించి. స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లోని మ‌హిళ‌ల‌కు నేరుగా డ‌బ్బును అందించ‌డం ద్వారా ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల‌కు ఆర్థిక చేయూత ఇవ్వ‌నున్న‌ట్లు టీడీపీ ప్ర‌క‌టించింది. ప్ర‌క‌టించిన వెంట‌నే ఈ ప‌థ‌కాన్ని అమ‌లులోకి పెట్టేసిన టీడీపీ స‌ర్కారు... ఇప్ప‌టికే మొద‌టి విడ‌త నిధుల‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో రెండో విడ‌త నిధులు కూడా మంజూరైపోయాయి. ఇక మూడో విడ‌త సొమ్ము స‌రిగ్గా పోలింగ్‌ కు ఓ నాలుగు రోజులు ముందుగా విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధం చేసింది.

ఈ ప‌థ‌కాన్ని కాస్తంత ఆస‌క్తిగానే ప‌రిశీలించిన కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ కూడా అమ‌లు చేసేందుకు వ్యూహం ర‌చించింది. అయితే ప‌థ‌కం స్వ‌రూపంతో పాటుగా పేరును - నిధుల మొత్తాన్ని కూడా మార్చేసిన బీజేపీ స‌ర్కారు.. ఆ ప‌థ‌కానికి మంగ‌ళ‌సూత్ర అంటూ పేరు పెట్టేసింది. ఈ ప‌థ‌కం కింద కొత్త‌గా పెళ్లి చేసుకునే యువ‌తుల‌కు మంగ‌ళ‌సూత్రాల‌ను ఉచితంగానే పంపిణీ చేయ‌నున్నార‌ట‌. టీడీపీ ప‌సుపు కుంకుమ ప‌థ‌కాన్ని అచ్చు గుద్దిన‌ట్టుగా పోలి ఉన్న ఈ ప‌థ‌కం బీజేపీకి ఏ మేర మైలేజీ ఇస్తుందో చూడాలి. ఇలా రెండు ప్ర‌ధాన పార్టీలు మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతుంటే.. మిగిలిన పార్టీలు కూడా త్వ‌ర‌లోనే ఇదే బాట ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.