Begin typing your search above and press return to search.

సచివాలయాల ద్వారా పాస్ పోర్టులు

By:  Tupaki Desk   |   1 May 2022 6:30 AM GMT
సచివాలయాల ద్వారా పాస్ పోర్టులు
X
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన వార్డు, గ్రామ సచివాలయాల్లో కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. పాస్ పోర్ట్ జారీ, పాన్ కార్డ్, రైల్వే టికెట్ల జారీ లాంటి సేవలను జనాలు సచివాలయాల ద్వారానే అందుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు పాస్ పోర్టులు తీసుకోవటం ఇకనుండి మరింత సులభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాస్ పోర్టు సేవలను అందుకోవచ్చు.

ఇప్పటివరకు ఎవరైనా పాస్ పోర్టు తీసుకోవాలంటే డైరెక్టుగా పాస్ పోర్టు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవటం లేదా బ్రోకర్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది. అలాంటిది గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా పాస్ పోర్టు అందుకునే సౌకర్యం ఏర్పాటైంది. ఇప్పటికే సచివాలయాల ద్వారా సుమారు 100 మంది పాస్ పోర్టులను అందుకున్నారు. పాస్ పోర్టులే కాకుండా మరో 500 మంది పాన్ కార్డుల సేవలను కూడా ఉపయోగించుకున్నారు.

ఇవే సచివాలయాల్లో రైల్వే టికెట్ల బుకింగ్ సేవలు అందించేందుకు రెడీ అవుతున్నాయి. మామూలుగా టికెట్ల బుకింగ్ అంటే ఐఆర్సీటీసీ పోర్టల్, లేదా నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్లడం అదీ కాదటంటే టికెటింగ్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవాలి. కానీ ఇపుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా రైల్వే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చంటే ప్రజలకు మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చినట్లే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖల్లోని 545 సేవలను సచివాలయాలు అందిస్తున్నాయి.

సచివాలయాల పనితీరును పరిశీలించిన తర్వాతే పాస్ పోర్టు, ప్యాన్ కార్డు, రైల్వే బుకింగ్ లాంటి సేవలను అందుబాటులో ఉంచటానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సచివాలయాల నుండే ఎల్ఐసీ ప్రీమియం కూడా చెల్లించచ్చు. ఇవే కాకుండా మరికొన్ని కమర్షియల్ సేవలు కూడా తొందరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలు 15 వేలకు పైగా పనిచేస్తున్నాయి. వీటిల్లో 1600 సచివాలయాల్లోని సిబ్బందికి అవసరమైన ట్రైనింగ్ ఇచ్చి కేంద్రప్రభుత్వ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు. మరింతమందికి తొందరలో ట్రైనింగ్ ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు.