Begin typing your search above and press return to search.
ఒక్క ట్వీట్ :26మంది బాలికలను కాపాడింది
By: Tupaki Desk | 7 July 2018 3:45 PM ISTఓ ప్రయాణికుడు చూపిన చొరవ 26 మంది బాలికలను కాపాడింది. సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగిస్తే ఎంత మంచి జరుగుతుందో ఈ సంఘటన రుజువు చేసింది. ఒక్క ట్వీట్ తో 26మందిని కాపాడిన ఓ వ్యక్తి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.
ముజఫర్ పూర్ నుంచి బాంద్రాకు వెళుతున్న అవధ్ ఎక్స్ ప్రెస్ రైలులో 26మంది 14 ఏళ్లలోపు బాలికలను తరలిస్తున్నారు. కొందరు బిగ్గరగా ఏడ్వడం చూసిన తోటి ప్రయాణికుడు ఆదర్స్ శ్రీవాస్తవకు అనుమానం వచ్చింది. బాలికలు ప్రమాదంలో ఉన్నారన్న విషయాన్ని పసిగట్టి వెంటనే ట్విట్టర్ ద్వారా రైల్వేశాఖకు ట్వీట్ చేశాడు. ‘ఈ రైల్లో 25మంది బాలికలు ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. వారిలో కొందరు రోధిస్తున్నారు. ప్రస్తుతం రైలు ఉత్తరప్రదేశ్ లోని హరినగర్ లో ఉంది’ అంటూ పోస్టు పెట్టాడు.
దీనికి వెంటనే స్పందించిన రైల్వే అధికారులు.. అరగంటలోపే ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లను సాధారణ ప్రయాణికుల్లా కప్తాన్ గంజ్ లో రైలు ఎక్కించారు.. గోరఖ్ పూర్ వరకూ బాలికలకు రక్షణగా ఉన్నారు. అనంతరం వారి అనుమానం నిజం కావడంతో బాలికలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.. బాదిత బాలికలు బీహార్ లోని చంపారన్ కు చెందిన వారని గుర్తించారు. వారిని శిశు సంక్షేమ కమిటీకి అప్పగించారు.
తన పోస్టుకు రైల్వేశాఖ వెంటనే స్పందించి బాలికను రక్షించడంపై శ్రీవాస్తవ కృతజ్ఞత తెలిపారు. కాగా యువకుడు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడికి కేంద్రం అవార్డు ఇచ్చి సత్కరించాలని కోరుతున్నారు.
