Begin typing your search above and press return to search.

గోపీచంద్ కు షాక్

By:  Tupaki Desk   |   24 Aug 2016 9:20 AM GMT
గోపీచంద్ కు షాక్
X
ఒలింపిక్సులో బ్యాడ్మింటన్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు దేశానికి కీర్తి ప్రతిష్టలు సాధించిపెట్టిన సందర్భంలో ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కు కూడా అంతేస్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా గోపీచంద్ వద్ద శిక్షణ పొందిన సైనా నెహ్వాల్ ఒలింపిక్సులో కాంస్య పతకం సాధించడంతో ఆయన శిక్షణకు గొప్ప పేరు వచ్చింది. అయితే.. తన శిష్యురాలు సింధు తిరుగులేని విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల్లో ఘన స్వాగతం పొందిన మరునాడే గోపీచంద్ కు ఊహించని షాక్ తగిలింది. గోపీచంద్ అకాడమీ నుంచి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కాశ్యప్ బయటకు వెళ్లిపోయాడు.

గోపీచంద్ అకాడెమీకి శిక్షణలో ఎంత పేరు ప్రఖ్యాతులున్నా కూడా ఆ అకాడమీని మాత్రం ప్రముఖ ఆటగాళ్లు వీడుతున్నారు. 2012 ఒలింపిక్స్ దాకా గోపీచంద్ అకాడెమీలో ఉన్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆ ఒలింపిక్స్ లో పతకం సాధించిన తరువాత గోపీచంద్ అకాడెమీని వీడారు. అయితే ఆమె ఆమె మొన్నటి రియో ఒలింపిక్స్ లో విఫలమైంది. తాజాగా బ్యాడ్మింటన్ లో ప్రముఖ క్రీడాకారుడిగా కొనసాగుతున్న పారుపల్లి కశ్యప్ కూడా గోపీచంద్ అకాడెమీని వీడాడు. మోకాలికి అయిన గాయం కారణంగా కశ్యప్ రియో ఒలింపిక్సులో పాల్గొనలేకపోయాడు. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న అతడు ఇకపై బెంగళూరును కేంద్రంగా చేసుకుని కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.

గోపీచంద్ అకాడెమీని వీడిన కశ్యప్ బెంగళూరులోని టామ్స్ బ్యాడ్మింటన్ అకాడెమీలో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఒలింపిక్సు పతకాలు సాధిస్తున్న గోపీచంద్ అకాడమీని క్రీడాకారులు ఎందుకు వీడుతున్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పైగా ఒలింపిక్సు పతకం సాధించిన తరువాత కూడా సైనా గోపీచంద్ అకాడమీని విడిచిపెట్టారు. ఇప్పుడు సింధు కూడా అదే బాటలో సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింధు విజయోత్సవ సభ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కూడా సింధుకు మరింత మెరుగైన కోచింగ్ ఇప్పిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆమె కూడా అకాడమీని వీడుతారా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే, గోపీచంద్ అకాడమీని వీడిన క్రీడాకారులు ఆ తరువాత రాణించలేకపోతుండడంతో సింధు ఇక్కడే కొనసాగొచ్చన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.