Begin typing your search above and press return to search.

ఏపీలో పార్టీల వారీగా ‘క్షత్రియుల’ ఫైట్

By:  Tupaki Desk   |   22 Jun 2021 6:30 AM GMT
ఏపీలో పార్టీల వారీగా ‘క్షత్రియుల’ ఫైట్
X
ఏపీలో ఇప్పుడు అగ్ర‘కుల’ ఫైట్ ముదిరిపాకాన పడుతోంది. ఏపీలో ప్రధానంగా మూడు కులాల ఆధిపత్యం అనాదిగా కొనసాగుతోందన్న చర్చ సాగుతోంది.. కమ్మ, రెడ్లు బలంగా ఉండగా.. క్షత్రియులు, కాపులు శాసించేవారు గా ఉన్నారు. ఈ క్రమంలోనే క్షత్రియ సామాజికవర్గం తాజాగా పత్రికల్లో ఇచ్చిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు, టీడీపీ మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజులు వైసీపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న వేళ ఈ లేఖ కలకలం రేపింది. తాజాగా రెండురాష్ట్రాల క్షత్రియ సమాజం పేరుతో విడుదలైన ప్రకటన టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

నిన్న పత్రికల్లో ‘క్షత్రియ సమాజం’ పేరిట ఒక ప్రకటన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌరవ మర్యాదలతో జీవన విధానాన్ని సాగిస్తున్న సామాజిక వర్గం క్షత్రియ సమాజం అని.. మాలో నూటికి 99శాతం మంది సామాజిక, రాజకీయ విమర్శలకు చాలా దూరంగా ఉంటారని పేర్కొన్నారు. మా సామాజికవర్గానికి చెందిన అశోక్ గజపతిరాజుపై రాజ్యసభ ఎంపీలు అసభ్య భాష వాడిన సంఘటన మా సమాజంలో కొంత ఆవేదన నెలకొంది పేర్కొన్నారు. పూసపాటి వంశీయులపై అమర్యాదకరంగా ప్రస్తావించడం బాధ కలిగించదన్నారు.

అశోక్ గజపతి, మాన్సాస్ ట్రప్ పై అసత్యప్రచారం, మంత్రుల విమర్శలు, వాడిన పదజాలం,దిగజార్చే విధంగా మాట్లాడారంటూ ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన వైసీపీకి కౌంటర్ గానే పడిందని రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

దీనికి వైసీపీకే చెందిన క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఏపీ మంత్రి రంగనాథరాజు మరో కౌంటర్ ప్రకటన ఇచ్చారు. క్షత్రియుల పేరుతో ఇచ్చిన ప్రకటన అసలు ఎవరిదోనని పేర్కొన్నారు. ఒక పార్టీకి కొమ్ముకాస్తూ ఇచ్చిన మద్దతుగా కనపడిందని అభిప్రాయపడ్డారు. రాజకీయ అంశాలకు కులపరమైన రంగులు పులుముకుంటూ ఇచ్చిన ప్రకటనగా పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు క్షత్రియురాలైన సంచయితకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని కోరారు. మాన్సాస్ ట్రస్ట్ అవినీతిపై ప్రకటనలో వివరించారు.

రాజకీయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ వ్యవహారాలలో కుల సంఘాల జోక్యం సరికాదంటూ మంత్రి రంగనాథరాజు సుధీర్ఘంగా ప్రకటన జారీ చేసి కౌంటర్ ఇచ్చారు.

ఏపీలో ఇప్పుడు ఏ రాజకీయ అంశమైనా సామాజికవర్గాలతో ముడిపెడుతున్న పరిస్థితి నెలకొంది. జగన్ సర్కార్ పై క్షత్రియ వర్గం ప్రకటన వెనుక కొందరే ఉన్నారని.. ఆ కొందరికీ వైసీపీ సర్కార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. ఒక వ్యక్తిపై దాడిని సామాజికవర్గంగా చిత్రీకరిస్తున్న వ్యవహారం ఎంతవరకు రాజకీయాలను వేడెక్కిస్తుందో చూడాలి మరీ.