Begin typing your search above and press return to search.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్

By:  Tupaki Desk   |   31 Dec 2019 7:11 AM GMT
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్
X
తెలంగాణ లో జనవరి చివరి వారంలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు నేతలు సిద్ధమవుతున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు,మంత్రులు, ఇతర ఉన్నత టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆదినుంచి జెండా మోసిన వారికి సీట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట.. మున్సిపల్ బరిలో మొత్తం తమ బంధుగణాన్ని నింపుతూ టీఆర్ఎస్ జెండా మోసిన వారికి షాకిస్తున్నారట..

నిజామాబాద్ లోని మూడు కీలక మున్సిపాల్టీల్లో ఎమ్మెల్యేలు తమ బంధువులనే చైర్మన్ గా నిలబెట్టేందుకు పావులు కదపడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ రేసులో ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన జీవన్ రెడ్డి తన తమ్ముడు రాజేశ్వర్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చాడు. వేరే ఏ నేతకు అవకాశం ఇవ్వడం లేదట..

ఇక బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ తన భార్య అయేషా ఫాతిమాను ఈసారి చైర్మన్ రేసులో నిలబెట్టి ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఎంఐఎంతో పొత్తు తో చైర్మన్ గిరీని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సైతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో తన కుటుంబానే ప్రాధాన్యం ఇచ్చారట.. పంచాయతీ నుంచి అప్ గ్రేడ్ అయిన బాన్సువాడ తొలి మున్సిపాలిటీలో తన సోదరుడు పోచారం శంభురెడ్డిని నిలబెట్టడానికి రెడీ అయ్యారు.

ఇలా రిజర్వేషన్లు రాకముందే ఎమ్మెల్యేలు ఆయా చైర్మన్ల పీఠంపై కన్నేశారు. బహుశా ముందే ఫిక్స్ చేసుకొని చైర్మన్ రిజర్వేషన్లను మేనేజ్ చేసి తమ బంధువులు ను చైర్మన్ పీఠాల పై కొలువు దీరేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం అనాదిగా గులాబీ పార్టీనే నమ్ముకొని ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు, జెండామోసినోళ్లకు కలవరానికి గురిచేస్తోంది.