Begin typing your search above and press return to search.

ఏపి బీజేపీ నేతల ఓవర్ యాక్షన్!

By:  Tupaki Desk   |   23 July 2021 1:30 PM GMT
ఏపి బీజేపీ నేతల ఓవర్ యాక్షన్!
X
ఒక్కసారిగా ఏపి బీజేపీ నేతల ఓవర్ యాక్షన్ మొదలైపోయింది. రాష్ట్రంలోని సమస్యలపై చర్చలంటు పార్టీ చీఫ్ సోమువీర్రాజు ఆధ్వర్యంలో కొందరు నేతలు ఢిల్లీలో హడావుడి చేస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో పాటు ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తులు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలం తెలంగాణా-ఏపి మధ్య జలజగడాలు జరుగుతుంటే బీజేపీ నేతలు తమకేమీ పట్టన్నట్లున్నారు.

జల వివాదాలపై ఏపికి వ్యతిరేకంగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రానికి లేఖరాసినా ఏపి బీజేపీ నేతలు పట్టించుకోలేదు. జల వివాదంతో తమకేమీ సంబంధం లేనట్లే వ్యవహరించారు. అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేస్తున్నా కమలనాదులు చోద్యం చూస్తుకూర్చున్నారు. కేంద్ర నిర్ణయానికి వైజాగ్ లో ఎన్ని ఆందోళనలు జరిగినా, పార్టీలు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా బీజేపీ కానీ దాని మిత్రపక్షం జనసేన నేతలు కానీ హాజరుకాలేదు.

స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గేదేలేదని కేంద్రం తేల్చిచెప్పేసింది. ఇలాంటి సమయంలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దని బీజేపీ నేతలు అడగటంలో అర్ధమేలేదు. ఎందుకంటే వీళ్ళెవరికీ కేంద్రం నిర్ణయాన్ని ప్రభావితం చేయగలిగేంత సీన్ లేదన్న విషయం అందరికీ తెలుసు. ఏదో జనాల ముందు మొహం చూపించాలి కాబట్టే కేంద్రానికి మొక్కుబడిగా ఓ విజ్ఞప్తిని అందించారు.

ఇక జల జగడాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరటంలో కూడా అర్ధమేలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేఖకు కేంద్రం సానుకూలంగా స్పందించిన కేంద్రం గోదావరి, కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డులను తన పరిధిలోకి తీసేసుకున్నది. జల జగడాలు దాదాపు ఒక కొలిక్కివస్తున్న దశలో హడావుడిగా బీజేపీ నేతలు కేంద్రమంత్రిని కలవటమంటే ఓవర్ యాక్షన్ అనే చెప్పాలి.

ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేసీయార్ వాదననే తెలంగాణా బీజేపీ వినిపిస్తోంది. కేసయార్ కు మద్దతుగా కేంద్రానికి బండి లేఖలు కూడా రాశారు. అదే ఏపి విషయానికి వచ్చేసరికి బీజేపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే మౌనంగా ఉండిపోయారు. జగన్ వాదనకు మద్దతుగా ప్రకటనలు కానీ లేదా కేంద్రానికి కనీసం లేఖలు కూడా రాయలేదు. తెలంగాణాలో కేసీయార్, ప్రభుత్వాన్ని బిజేపీ వేర్వేరుగా చూడటంలేదు.

కానీ ఏపికి వచ్చేసరికి ప్రభుత్వం వేరు జగన్ వేరని బహుశా ఏపి బీజేపీ నేతలు అనుకుంటున్నారేమో. అందుకనే రాష్ట్రంలో మద్దతుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. చివరకు రాష్ట్రంలో ఏమీ మాట్లాడని కమలనాదులు కేంద్రమంత్రులను కలవటం వెంటనే మీడియా సమావేశాలు పెట్టి తమ పర్యటనను హైలైట్ చేయించుకోవటం బాగానే ఉంది.