Begin typing your search above and press return to search.

ఏపీలో కాపు ఓటు బ్యాంకుపై కన్నేసిన పార్టీలు

By:  Tupaki Desk   |   21 Sep 2020 11:50 AM GMT
ఏపీలో కాపు ఓటు బ్యాంకుపై కన్నేసిన పార్టీలు
X
ఏపీలో కుల రాజకీయాల హవా సాగుతోందనేది బహిరంగ రహస్యమే. ఏపీలో 15 శాతం ఓట్లున్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు మిగతా సామాజిక వర్గాల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. ప్రత్యేకించి తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖలో కాపుల ఓటింగ్ శాతం ఎక్కువ. అయినప్పటికీ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు పూర్తి స్థాయిలో అధికారం చేపట్టలేకపోయారు. 2009లో `ప్రజారాజ్యం`తో చిరంజీవి ఆ ఓటుబ్యాంకును క్యాష్ చేసుకొని అధికారం దక్కించుకోవాలని భావించారు. కానీ, కేవలం 18 సీట్లకే పరిమితమై ఆ తర్వాత...ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇక, 2014లో జనసేనతో పవన్ కల్యాణ్ ఆ ఓటుబ్యాంకుతో అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. ఇక, 2019 ఎన్నికలలో విశాఖలోని నాలుగు అసెంబ్లీ సీట్లను వైసీపీ కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల నాటికి ఏపీలోని కాపుల ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి.

విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే కాపు నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదటుపెట్టారట. అందులోనూ, పాలనా రాజధానిగా విశాఖ మారబోతున్న నేపథ్యంలో ఇక్కడ పట్టు పెంచుకోవాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలోని బీజేపీ....కాపులందరినీ ఏకం చేసి...2024లో అధికారం చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలకు దన్నుగా ఉన్న సామాజిక వర్గాల ఫార్ములాను బీజేపీ ఫాలో కావాలని చూస్తోంది. అందుకే, కాపు సామాజికవర్గాన్ని పునాదిగా చేసుకొని....హిందూ ఓటు బ్యాంకు, తటస్థులు, ఇతర వర్గాల ఓటు బ్యాంకును కలుపుకొని 2024 ఎన్నికలలో సత్తా చాటాలని చూస్తోంది. బీజేపీ, జనసేనల కలయికకు వీర్రాజు, పవన్ ల నాయకత్వం అండగా ఉందన్న సంకేతాలను పంపి కాపు ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోంది.

మరోవైపు, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత, సీనియర్ పొలిటిషియన్ ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు ఓటు బ్యాంకు ద్వారా అధికారం పొందాలని మరో వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తోందట. రాజకీయలకు స్వస్తి చెప్పిన ముద్రగడను ముందు పెట్టి....కాపు రిజర్వేషన్ల అంశమే ఎజెండాగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని మరో వర్గం ప్రయత్నిస్తోందట.ఇక, ఇప్పటికే టీడీపీకి కాపు ఓటు బ్యాంకులో కొంత శాతం మద్దతు ఉంది. ఆ శాతాన్ని మరింత పెంచుకోవాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారట. ఇలా, ఏపీలో 15 శాతం వరకూ ఓటింగ్ ఉన్న బలమైన సామాజిక వర్గమైన కాపుల మద్దతు కూడగట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఆ ఓటు బ్యాంకును గంపగుత్తగా కొల్లగొట్టడమో....లేదంటే చీల్చడమో....సమర్థవంతంగా చేయగలిగిన పార్టీ ఏదన్నది తేలాల్సి ఉంది.