Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప పోరులో ఏ పార్టీ ఎంత ఇస్తోంది?

By:  Tupaki Desk   |   28 Oct 2021 9:30 AM GMT
హుజూరాబాద్ ఉప పోరులో ఏ పార్టీ ఎంత ఇస్తోంది?
X
తెలంగాణలోనే కాదు ఏపీలోనూ అందరిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు చివరి అంకానికి చేరుకుంది. ప్రచారానికి తెర పడటమేకాదు.. ప్రస్తుతం పోలింగ్ కోసం అన్ని పార్టీలు సమాయుత్తమవుతున్నాయి. ఇలాంటివేళ.. ప్రలోభాల పర్వానికి తెర లేచింది. తెలంగాణ అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థతుల్లోనూ తాము డిసైడ్ చేసిన అభ్యర్థిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో గులాబీ బాస్ ఉన్నారు. ఇందుకోసం ఆయన భారీ ఎత్తున వ్యూహారచన చేయటమే కాదు.. తన బలగాల్ని పెద్ద ఎత్తున దింపారు. నెలల తరబడి చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు.. పోలింగ్ ముంగిట్లోకి వచ్చిన వేళ.. ఆఖరి గంటల్లో జరిగే పంపకాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

పోలింగ్ కు మరో రెండు రోజులు మాత్రమే ఉన్న వేళ.. నియోజకవర్గం మొత్తంగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు.. వారిని ఆకర్షించేందుకు వీలుగా పంపకాలు పెద్ద ఎత్తున మొదలైనట్లుగా చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పంపకాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ముందు ఉందంటున్నారు. ఒక్కో ఓటుకు రూ.6 వేల చొప్పున ఇస్తున్నట్లు చెబుతున్నారు. పంపకాల కోసం కొత్త విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.

కవరులో డబ్బులు ఉంచి.. దాని మీద ఏ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న అంకెను వేయటం ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేస్తున్నట్లు చెబుతున్నారు. కవరు మీద ఒక నెంబరు అంటే.. ఒక ఓటు ఉన్నట్లు.. ఓటుకు రూ.6వేలు ఇస్తున్నారు. కవరు మీద ‘‘3’’ అంకె ఉంటే.. ఆ ఇంట్లో ఉన్న మూడు ఓట్లకు రూ.18వేలు ఇస్తున్నారు. ఇలా ఇంత భారీగా ఓట్ల కొనుగోలు కార్యక్రమం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఉప పోరులో ఓటర్లకు అత్యధికంగాపంపకాలు జరుపుతున్న పార్టీగా టీఆర్ఎస్ ను చెబుతున్నారు. గతంలో మరే ఎన్నిక సందర్భంగా కూడా ఇవ్వని రీతిలో ఒక్కో ఓటుకు రూ.6వేలు చొప్పున ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక్కో ఓటుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేయటం కష్టంగా మారిన నేపథ్యంలో తొలుత రూ.3500 ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇస్తామన్న మాటను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.1500 చొప్పున పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం ఎలాంటి పంపిణీ చేయటం లేదని.. కొద్దిమందికి మాత్రమే ఇస్తున్నట్లు చెబుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు మొదలైన నగదు పంపిణీ ఉదయం ఆరు గంటల మధ్యలో పూర్తి చేస్తున్నారు. గతంలో అర్థరాత్రి వేళలో చేసే పంపిణీని ఈ మధ్యన తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు.