Begin typing your search above and press return to search.

మోడీ కుర్చీ కోసం మూడో కూటమి?

By:  Tupaki Desk   |   7 Nov 2016 10:51 AM GMT
మోడీ కుర్చీ కోసం మూడో కూటమి?
X
మోడీ ప్రభుత్వానికి రెండున్నరేళ్లు పూర్తికావడం... మళ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే ఉండడం... అయిదేళ్లు పూర్తికాకముందే మోడీ ఎన్నికలకు వెళ్లొచ్చనే అంచనాలు ఉండడంతో దేశంలోని ప్రాంతీయ పార్టీలు - ప్రత్యామ్నాయ జాతీయ పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ లేవలేని స్థితిలో ఉండడంతో కొత్త కూటమితో ఎన్నికలకు వెళ్లాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. పశ్చిమ్ బెంగాల్లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత ఆధ్వర్యంలో పలు పార్టీలు కూటమి దిశగా పయనిస్తున్నాయి.

దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని.. దీనికి కారణమైన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి అన్ని పార్టీలు కలసి రావాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. మాజీ సైనికోద్యోగి రాంకిషన్ గ్రేవాల్ కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అను అడ్డుకోవడం... భోపాల్ లో సిమి ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేయడం... ఎన్డీటీవీ ప్రసారాలను ఒక రోజు నిషేధించడం తదితర అంశాలపై మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, అన్ని పార్టీలు కలిసి కూర్చుని, మాట్లాడుకుందామని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదామని మమత సూచిస్తున్నారు. మమత పిలుపును కాంగ్రెస్ - ఆప్ - జేడీయూ - సమాజ్ వాదీ పార్టీలు స్వాగతించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి తాము సిద్ధమని ప్రకటించాయి.

తొలుత కొద్దికాలంలో బీజేపీతో సంబంధాల విషయంలో దోబూచులాడిన మమత ఇప్పుడు బీజేపీపై మండిపడుతున్నారు. పొరుగునే ఉన్న అస్సాం రాష్ట్రాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం.. ఎగువన ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోనూ తమ రాజకీయ వ్యూహంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బెంగాల్లోనూ విస్తరించడానికి బీజేపీ చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తుండడంతో ఆమె జాగ్రత్త పడుతోంది. ఇదంతా కేంద్రంలో బీజేపీకి ఉన్న బలం కారణంగానే సాధ్యమవుతోందని గుర్తించిన ఆమె ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వంటి బీజేపీ వ్యతిరేక పార్టీలు ఆమె వెంట నడవడానికి సిద్ధమవుతున్నాయి. దీంతో త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. గతంతో థర్డు ఫ్రంటులో ఉన్న పార్టీలే కాకుండా కొత్తగా ఆప్.. పంజాబ్, యూపీల్లో ఎన్నికల తరువాత అక్కడ పరిస్తితిని బట్టి కూటమిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/