Begin typing your search above and press return to search.

2019 కోసం మోదీ 'బీసీ' మంత్రం

By:  Tupaki Desk   |   7 Aug 2018 9:26 AM GMT
2019 కోసం మోదీ బీసీ మంత్రం
X
ఒకే ఎత్తుగడతో ఎన్నికలకు వెళ్లడం ప్రధాని నరేంద్రమోదీకి ఏమాత్రం నచ్చదట. అందుకే 2014 నాటి ఎన్నికల ప్రణాళికలు - ఆ తరువాత ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాలను పక్కన పెట్టి ఈసారి దేశవ్యాప్తంగా ఓట్లు తెచ్చిపెట్టే బలమైన వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం పఠించి - దాంతో పాటు మరిన్ని ఆసక్తికరమైన హామీలిచ్చి పీఎం పీఠం ఎక్కేశారు. ఆ తరువాత పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీని వ్యతిరేకించే ముస్లింలను ఊరడించి ఓట్లు సంపాదించుకునే సాధారణ వ్యూహాన్ని పక్కనపెట్టి వారిని పూర్తిగా విస్మరించి ముస్లిమేతర ఓట్లన్నిటినీ గంపగుత్తగా బీజేపీ ఖాతాలో వేసుకుని భారీ విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల కోసం మోదీ అంతకంటే పవర్‌ ఫుల్ ఆయుధం బయటకు తీస్తున్నారట.

బీసీల్లో తమకూ చోటు కల్పించాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నా - ఆయా రాష్ట్రాల నుంచి దీనిపై కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నా వాటినేమీ పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పటికే ఉన్న ఓబీసీల ఓట్ బ్యాంక్‌ ను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం మొదలుపెట్టారు మోదీ. ఇందులో భాగమే కీలకమైన వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌ సిబీసీ) సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోద ముద్ర పడేలా చేయడం.

ఎన్‌ సిబీసీ బిల్లుకు ఈనెల 2న లోక్‌ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపగా తాజాగా పెద్దల సభ కూడా ఆమోద ముద్రవేసింది. 123వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్‌ సిబీసీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ హోదా లభించడం వల్ల వెనకబడిన తరగతుల ప్రజలు వేధింపులపై కూడా న్యాయ పోరా టం చేసే అవకాశం దక్కిందన్న మెసేజ్‌ ను కేంద్రం ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

బీసీలకు న్యాయం చేకూర్చేదిశగా రూపొందించిన బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదముద్ర లభించడం చారిత్రాత్మక మైన విషయంగా మోదీ అభివర్ణించడం ఇక్కడ ప్రస్తావనార్హం. వెనకబడిన తరగతుల వారిపై అకృత్యాలు జరిగితే సత్వర న్యాయం చేయాలన్న కృతనిశ్చయం తమకు ఉందని మోదీ అంటున్నారు.

దేశంలో 41 శాతం ఓబీసీలున్నారు. ప్రతి రాష్ట్రంలో పార్టీల గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించేది వీరే. కొన్ని రాష్ట్రాల్లో బీసీలు కాంగ్రెస్‌ కు అనుకూలంగా ఉండగా.. మరికొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీల పక్షం వహిస్తున్నారు. అయితే.. కేంద్రం మీ కోసం పనిచేస్తోంది... మీ ప్రయోజనాలూ పట్టించుకుంటోంది అన్న సందేశాన్ని వారికి పంపించి దేశవ్యాప్తంగా బీసీల ఓట్లు బీజేపీ వైపు మళ్లించాలన్న బృహత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు సమాచారం.