Begin typing your search above and press return to search.

ఏపీకి హోదా.. రాజ్య‌స‌భ లైవ్ ను ఆపేసింది

By:  Tupaki Desk   |   23 July 2018 11:13 AM GMT
ఏపీకి హోదా.. రాజ్య‌స‌భ లైవ్ ను ఆపేసింది
X
మ‌రో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. సుమారు నాలుగేళ్ల కింద‌ట ఏపీని రెండు ముక్క‌లు చేసేందుకు లోక్ స‌భ లైవ్ ను కాసేపు ఆపేసి.. త‌లుపులు మూసేసిన వైనం తెలిసిందే. మ‌రోమారు ఏపీ అంశం రాజ్య‌స‌భ లైవ్ ను టీవీల్లో నిలిపివేసేలా చేసింది. పార్ల‌మెంటు స‌మావేశాల చ‌రిత్ర‌లో ఈ ప‌రిణామం మ‌రో సంచ‌ల‌నంగా చెబుతున్నారు.

ఏపీ అధికార‌.. విప‌క్ష స‌భ్యులు స‌భా కార్య‌క‌లాపాలు అడ్డు త‌గులుతున్నార‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు స‌భ‌కు సంబంధించిన లైవ్ ప్ర‌సారాల్ని దాదాపు 30 నిమిషాల పాటు నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.

సోమ‌వారం రాజ్య‌స‌భ ప్రారంభం అయినప్ప‌టి నుంచి ఏపీ స‌మ‌స్య‌ల‌పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌కు ఓకే చెప్పాలంటూ టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప‌దే ప‌దే అడ్డు త‌గిలాయి. దీంతో.. చ‌ర్చ‌ను మంగ‌ళ‌వారం జ‌రుపుతామ‌ని వెంక‌య్య చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. విన‌ని ఎంపీలు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో.. లైవ్ ప్ర‌సారాలు నిలిపివేయాలంటూ ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు.

స‌భ స‌జావుగా సాగేలా వ్య‌వ‌హ‌రించాల‌ని స‌భ్యుల్ని కోరినా.. వారు ప‌ట్టించుకోలేదు. టీడీపీ స‌భ్యులు పోడియంను చుట్టుముట్ట‌గా.. వైఎస్సార్ కాంగ్రెస్ స‌భ్యులు మాత్రం త‌మ స్థానాల్లో నిల‌బ‌డి గౌర‌వ‌ప్ర‌దంగా ఆందోళ‌న చేప‌ట్టారు. త‌మ‌కు న్యాయం కావాలంటూ నినాదాలు చేసిన వైనంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స‌భాప‌తి స్థానంలో ఉన్న వెంక‌య్య‌.. మీ గోల ఎవ‌రూ విన‌టం లేదు.. చూడ‌టం లేదు.. ఇంకా ఎందుకు అరుస్తారంటూ మండిప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ స‌భ్యుల ఆందోళ‌న‌లు ఆగ‌క‌పోవ‌టంతో లైవ్ ప్ర‌సారాల్ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించారు.

అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు ఇలానే ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీతో పెట్టుకున్న ఏ పార్టీ బాగుప‌డింది లేద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తున్న వేళ‌.. అత్యుత్త‌మ స్థానంలో ఉన్న వెంక‌య్య‌.. లైవ్ టెలికాస్ట్ ల‌ను నిలిపివేసే సంప్ర‌దాయాన్ని మొద‌లు పెడితే.. రానున్న రోజుల్లో ఆదో అల‌వాటుగా మారి భారీ న‌స్టానికి కార‌ణ‌మ‌వుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని ప‌లువురు ప్ర‌జాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.