Begin typing your search above and press return to search.

అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్..

By:  Tupaki Desk   |   4 Aug 2015 10:01 AM GMT
అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్..
X
కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతిపక్ష బీజేపీ పార్లమెంటును సజావుగా సాగనీయదు. బీజేపీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తుంది. ఇది భారతదేశంలో స్థిరపడిన విధానంలా ఉంది. కాంగ్రెస్ హయాంలో నెలలతరబడి పార్లమెంటు కార్యకలాపాలను బీజేపీ సాగనీయలేదు. ఇప్పుడు పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో కనీసం పార్లమెంటు అయినా సజావుగా సాగుతుందని అనుకున్నారు. కానీ అది కూడా జరగడం లేదు.

కాంగ్రెస్ పదేళ్ల హయాంలో వరుస కుంభకోణాలు జరిగాయి. బొగ్గు కుంభకోణం బయటకు వస్తే పార్లమెంటు సాగలేదు. ఆదర్శ్ కుంభకోణం బయటకు వస్తే రెండు నెలలపాటు పార్లమెంటు సాగలేదు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం బయటకు వస్తే దాదాపు ఏడాదిపాటు పార్లమెంటు కార్యకలాపాలు సాగలేదు. ఇవి మాత్రమే కాదు.. వివిధ కుంభకోణాల సమయంలోనూ ఇదే పరిస్థితి. అధికార పక్షం వినతి మేరకు ఒక్క బడ్జెట్ సమావేశాలు మినహా మిగిలిన వర్షాకాల, శీతాకాల సమావేశాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క రోజయినా సమావేశాలు సజావుగా సాగలేదు. అప్పట్లో ఆయా కుంభకోణాల్లో ఉన్న మంత్రలుతోపాటు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలంటూ బీజేపీ పట్టుబట్టింది.

కాంగ్రెస్ పార్టీ కనీసం పార్లమెంటును కూడా సజావుగా నిర్వహించలేకపోతోందని, తాము అధికారంలోకి వస్తే పార్లమెంటును అద్భుతంగా నడుపుతామని ఎన్నికల సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి. లలిత్ మోదీకి సుష్మ సహకరించింది. ఆయనకు వసుంధర రాజే సహకరించింది. వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. వీటన్నిటిపైనా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ తన మంత్రులను తొలగించి విచారణకు ఆదేశించింది. ఇప్పుడు మోదీ సర్కారు మంత్రులనూ తొలగించడం లేదు. విచారణకూ ఆదేశించడం లేదు. పార్లమెంటునూ సజావుగా నిర్వహించడం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా ఒకటే పరిస్థితి.